ఇరువర్గాలు ఎమ్మెల్యే గెలుపుపైనే సవాళ్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దుమ్ముగూడెం మండలంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గిరిజన అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి బీఆర్‌ఎస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి మాట్లాడుతుండగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశ వేదికపై కూర్చున్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాక్షిగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఇద్దరు ఎమ్మెల్యేలు నడుమ చోటుచేసుకున్న వాగ్వివాదంను నిలుపుదల చేసేలా జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పి డాక్టర్ వినీత్. జితో పాటుగా అటవీ శాఖ అధికారి జోక్యం చేసుకొని ఎమ్మెల్యేల గొడవను సద్దుమణిగించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ దోమల రమేష్ ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహించారు. ఏది ఏమైనా ఇద్దరు ఎమ్మెల్యేలు నడుమ వాగ్వాదం చోటు చేసుకోవడంతో వేదిక పైనున్న పెద్దలు షాక్కు గురయ్యారని చెప్పవచ్చు.