Take a fresh look at your lifestyle.

‌ప్రజల మనిషి రామలింగారెడ్డి ఇకలేరు..

రామలింగారెడ్డి మృతి పట్ల సిఎం, మంత్రులు, పలువురు దిగ్భ్రాంతి
సిద్ధిపేట, ఆగస్టు 6 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి(59)కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామలింగారెడ్డి గురువారం రెండున్నర గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. సుమారు రెండున్నర దశబ్దాల పాటు జర్నలిస్టుగా పని చేసిన రామలింగారెడ్డి..2001లో టిఆర్‌ఎస్‌ అధినేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2004లో కేసీఆర్‌ ‌పిలుపుమేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పాత దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు రామలింగారెడ్డి. 2004తో పాటు 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు. 2009లో కొత్తగా ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గం నుంచి ఓటమి పాలు చెందిన రామలింగారెడ్డి 2014, 2019లో జరిగిన వరుస ఎన్నికలలో గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. నిరంతరం ప్రజలతో కలిసి, ప్రజల్లో గడిపి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అయిన రామలింగారెడ్డి…ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. రామలింగారెడ్డికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
రామలింగారెడ్డి మృతి పట్ల సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు తదితరుల దిగ్బ్రాంతి..
దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పత్రికారంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వి , నిరాడంబరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణవార్త తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందనీ, రామలింగారెడ్డి మృతి పట్ల సంతాపాం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు కూడా రామలింగారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయన మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు తీరనిలోటు ..ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌తెలంగాణ ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తున్నామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!