- హాజరైన సిఎం కెసిఆర్..మంత్రులు
- భారీగా తరలివొచ్చిన అభిమానులు, నేతలుు
ప్రజాతంత్ర, నల్లగొండ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో పూర్తయ్యాయి. వేలాదిగా తరలివొచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 11:30 గంటలకు పాలెం చేరుకుని, నోముల భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. నోముల కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.
ప్రగతిభవన్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సిఎం కెసిఆర్ నేరుగా అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి చేరుకుని నోముల నర్సింహయ్య భార్య, కుమారుడిని ఓదార్చారు. గంటపాటు అక్కడే ఉన్నారు. అంతకుముందు వ్వయసాయ క్షేత్రం వరకు నోముల నర్సింహయ్య అంతిమయాత్ర చేపట్టారు.