కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తున్నది. కొన్ని అంశాల్లోతప్ప గత బడ్జెట్‌లతో పోలిస్తే పెద్దగా చెప్పుకోదగిందేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇది ఎన్నికల సంవత్సరం, పైగా చివరి బడ్జెట్ కావడంతో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం నిరాశకు గురిచేసిందని విభిన్న రాష్ట్రాలనుండి నిరసనలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా కేటాయింపుల్లో ఏఏ అంశానికి ఏ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తున్నారన్న విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదంటున్నారు. కాగా ఎప్పటిలాగానే ఈసారి బడ్జెట్‌లో కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. టాక్స్‌ల రూపంలో తెలంగాణనుండి కేంద్రానికి ఇతర రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులు సమకూరుతున్న కేటాయింపుల్లో మాత్రం చిన్నచూపును ప్రదర్శించడమన్నది ఈసారికూడా రుజువైందంటున్నారు తెలంగాణ నాయకులు. గడచిన తొమ్మిదేళ్ళుగా విభజన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న బిజెపి సర్కార్, కనీసం తానిచ్చిన హామీలనుకూడా పూర్తి చేయలేకపోయింది.
ఈ చివరి బడ్జెట్‌లోనైనా తెలంగాణకు కాస్త వెసులుబాటు కల్పిస్తారని ఇక్కడి ప్రజల ఆశలపైన ఈ బడ్జెట్ నీళ్ళే చల్లింది. కొత్త పథకాలేవీ లేకున్నా ఇప్పటివరకు డిమాండ్‌లో ఉన్నవాటినైనా పరిగణలోకి తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడడంతో ఆ జిల్లాలకు కొత్తగా నవోదయ పాఠశాలలను కేటాయిస్తారనుకున్నారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారనుకుంటే శూన్యహస్తమే చూపించారు. కొత్తగా ఒక వైద్యకళాశాలనుకూడా మంజూరు చేయకపోవడం, దేశవ్యాప్తంగా ఉన్న నిమ్స్ హాస్పిటల్స్ కు కలిపి కేటాయించిన నిధుల్లో హైదరాబాద్ నిమ్స్‌కు ఏ మేరకు నిధులు సమకూరుతాయన్నది స్పష్టత లేదు. ఒకవేళ అరకొర నిధులు కేటాయిస్తే అది దిల్లీ స్థాయి హాస్పిటల్ తరహాలో ఎప్పటికి ఎదుగుతుందో తెలియదు. బయ్యారం ఉక్కు విషయంపై ఎంతోకాలంగా చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదనడానికి ఈ బడ్జెట్‌లో అందుకు ఎలాంటి కేటాయింపులు చేయకపోవడమే. అలాగే దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకున్న కాళేశ్వరాన్ని కూడా బడ్జెట్‌లో కేంద్రం మర్చిపోయింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు కేటాయిస్తారనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆశ నిరాశను చేసిందీ బడ్జెట్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు. మైనార్టీల నిధుల విషయంలో గతంతో పోలిస్తే సగానికి తగ్గించేశారు. ఇక కరువు ప్రాంతంగా దేశంలోని కర్ణాటక రాష్ట్రాన్ని మాత్రమే ప్రత్యేకంగా గుర్తించి, అత్యధిక నిధులను కేటాయించడంపట్ల తెలంగాణ సర్కార్ తీవ్రంగా విమర్శిస్తోంది.
త్వరలో అక్కడ జరిగే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రానికి బడ్జెట్‌లో ప్రత్యేకతను కల్పించి కేంద్రం తన స్వార్థ రాజకీయాన్ని ప్రదర్శించు కుందంటున్నారు తెలంగాణ ప్రజాప్రతినిధులు. రైతుల గురించి ఊదరగొట్టే ఈ ప్రభుత్వం రైతులు, గ్రామీణ పేదలకు ఈ బడ్జెట్‌లో గుర్తింపునివ్వలేదని వారు విమర్శిస్తున్నారు. ప్రధానంగా పారిశ్రామికంగా ఎదుగుతున్న తెలంగాణలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఎలాంటి శ్రద్ద పెట్టకపోవడంపట్ల ఈ ప్రాంత వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రతీఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న బిజెపి సర్కార్ ఆ విషయాన్నే మరిచిపోయిందని బీహార్‌కు చెందిన ఆర్‌జెడి నాయకుడు తేజస్వీ యాదవ్ ట్విటర్‌లో తన తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీలన్నీ ఏమైనాయని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అలాగే సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గడచిన తొమ్మిదేళ్ళుగా ఏమీ చేయలేకపోయిన బిజెపి ఈ ఆఖరి బడ్జెట్‌లో మాత్రం ఏం చేస్తుంది, మరింత నిరుద్యోగానికి పెంచడం మినహా అంటూ తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.
ఈ బడ్జెట్ పూర్తిగా బడా బాబులకు ఉపయోగపడేలాగుందని, గత రెండేళ్ళలో దేశంలోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఆహారం, ఎరువులు, పెట్రోల్ ధరలపై ప్రభుత్వం సబ్సిడీ• తీసివేయడంతో విపరీతంగా ధరలు పెరిగిపోయాయని, వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ ముమ్మాటికీ ప్రజా వ్యతిరేకమైనదేనంటాడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఎచూరి. మయావతి, ఆప్ నాయకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంతో కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ విషయంలో మాత్రం కాస్త వెసులుబాటు కల్పించడం సంతోషించదగిందిగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే మహిళలకోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అన్న కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టడం, వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ చేసే గరిష్ట పరిమితిని పదిహేను లక్షల నుండి ముప్పై లక్షలకు పెంచడం సంతోషించాల్సిన విషయమంటున్నారు.