తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వం: రఘునందన్
ఉద్యమ స్పూర్తికి.. ఆత్మ బలిదానాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం ఉందని, జాతీయ గీతాలాపన తర్వాత జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఎందుకు ఆలపించలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతూ ప్రభుత్వం దశా దిశ లేకుండా నడుస్తుందన్నారు. శ్రమ శక్తికి, మేథోసంపత్తికి విలువ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకే ఉద్యమ ఆకాంక్ష కోసం తెలంగాణలో మరో ఉద్యమం రాజుకుంటుందన్నారు. ప్రాజెక్టులు పూర్తయినట్లుగా గవర్నర్చే తప్పుడు ప్రసంగం చేయించారని విమర్శించారు. తమ జిల్లాలో ఉన్న రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు అందిస్తున్న నష్ట పరిహారంలో వ్యత్యాసం దేనికని ప్రశ్నించారు. తక్షణం ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజి అందజేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా లేదని రఘునందన్ రావు విమర్శించారు. కొత్త ఆసరా పించన్ లేదని, అప్పుల పరిధిని 3 నుంచి 3.5 శాతానికి కేంద్రం పెంచినా… రైతు రుణమాఫీని ఏక కాలంలో ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు విపరీతంగా ఉన్నాయని, 144 సెక్షన్ 24 గంటలు ఉంటుందన్నారు. శాంతిభద్రతలు సరిగా లేవని, వరంగల్లో నడి రోడ్డుపై పూజారిని హత్య చేసారన్నారు. బైంసాలో నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగిందని.. సీసీ టీవీలు.. కమాండ్ కంట్రోల్ రూమ్లు అన్నారు.. అవి అన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. శాంతి భద్రతల కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను హత్యలు చేస్తున్నారని, అందుకు న్యాయవాద దంపతుల హత్యే దీనికి ఉదాహరణగా రఘునందన్ రావు పేర్కొన్నారు.