- టీఆర్ఎస్ నేతల విచారణ జరగాలి
- హైకోర్టును ఆశ్రయిస్తామన్న ఉత్తమ్
- 13మంది మంత్రులు భూకబ్జాలు చేశారన్న సంపత్
అధికార టీఆర్ఎస్ నేతలు పేదల భూములను రాబందుల్లా తింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. భూములు లాక్కోవడానికే ప్రజా ప్రతినిధులైనట్లు టీఆర్ఎస్ వాళ్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేబినెట్ లో ఉంటూ మంత్రులే దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అత్యంత జాగరకూతతో ఉంటూ, అధికార పార్టీ నేతల భూ అక్రమాల వివరాలు అందించాలని ఉత్తమ్ సూచించారు. భూముల విషయంలో తాము గవర్నర్‌కు లేఖ రాస్తామని, భూముల దొంగలపై ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు.
టీఆర్ఎస్ నేతల భూకబ్జాలపై విచారణ జరగాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. పేదల భూములపై అధికార టీఆర్ఎస్ నేతలు గద్దల్లా వాలుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కేబినెట్లో 12 మంది మంత్రులపై భూకబ్జా ఆరోపణలున్నాయని, టీఆర్ఎస్ పాలనలో 7 లక్షల ఎకరాలు కబ్జా అయినట్లు రియల్టర్ల అసోసియేషన్ ఆరోపించిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల భూకబ్జాలపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జన్వాడలో 111(జీ) లో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ కట్టుకున్నారని, దేవరాయాంజల్ లో కూడా వివాదాస్పద భూములను కేటీఆర్ కొనుక్కొన్నారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి తన కాలేజీలను కూడా అనుమతులు లేకుండా నిర్మించారని, అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. వీరిద్దరితో పాటు మరో మంత్రి గంగుల కమలాకర్ కాజిపూర్ సర్వే నెం 126 లో వక్ఫ్‌బోర్డు భూములను కబ్జా చేశారని, మంత్రి పువ్వాడ అజయ్ కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని తన మెడికల్ కాలేజీలో కలుపుకున్నారని సంపత్ ఆరోపించారు.
పార్టీ ఫిరాయించినందుకే ఆయనకు సర్వే నెంబర్ 58,59 లో కోట్లు విలువ చేసే భూమిని నజరానాగా ఇచ్చారని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పెబ్బేరు, కొత్తపేట గ్రామాల్లో భూములను ఆక్రమించారని, మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని, ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ వి•ద కూడా ఆరోపణలు ఉన్నాయని వివరించారు. ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణం సర్వే 1309 లో 5 ఎకరాలను ఆక్రమించారని, ఇవేవీ కూడా సీఎంకు కనిపించడం లేదా? అని సంతప్ నిలదీశారు. మంత్రుల భూ ఆక్రమణలపై విచారణ జరగాలని, నిజాలు నిగ్గుతేల్చాలని పేర్కొన్నారు. సీబీఐతో గానీ, సెంట్రల్ విజిలెన్స్‌తో గానీ ప్రభుత్వం విచారణ జరిపించాలని సంపత్ డిమాండ్ చేశారు.