Take a fresh look at your lifestyle.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు

రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం
హైదరాబాద్‌ ‌నుంచి వాణీదేవి, నల్గొండ నుంచి పల్లా గెలుపు
‌తెలంగాణ భవన్‌లో మిన్నంటిన సంబరాలు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ ::
‌నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన హైదరాబాద్‌-‌రంగారెడ్డి,- మహబూబ్‌నగర్‌, ‌నల్గొండ- వరంగల్‌- ‌ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. శనివారం సాయంత్రం వరకు జరిపిన వోట్ల లెక్కింపులో హైదరాబాద్‌ ‌నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.‌రాంచందర్‌రావుపై గెలుపొందారు.

వాణీదేవి మొదటి ప్రాధాన్యత వోట్లు 1,12,689 సాధించగా, 36,580 రెండో ప్రాధాన్యత వోట్లు పాలయ్యాయి. రెండో ప్రాధాన్యత వోట్లతో ఆమె విజయం సాధించారు. మొత్తం 1,49,269 వోట్లతో వాణీదేవి విజయఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు 1,19,198 వోట్లు వచ్చాయి. రాంచందర్‌రావు వోటమితో బీజేపీ సిట్టింగ్‌ ‌స్థానాన్ని కోల్పోయినట్లయింది. వాణీదేవి గెలుపుతో తెలంగాణ భవన్‌లో సంబరాలు మిన్నంటాయి. కాగా, నల్గొండ, వరంగల్‌, ‌ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికార టీఆరెస్‌ ‌పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు.

ఆయన తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ ‌మల్లన్నపై 24,579 వోట్ల తేడాతో ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యతా వోట్లతో పల్లా విజయం సాధించారు. కోదండరామ్‌తో పాటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ అయిన వెంటనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు ఖాయమైంది. . స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ ‌మల్లన్న రెండో స్థానంలో నిలవడం విశేషం. మోత్తంగా పల్లాకు 1,22,639 వోట్లు రాగా, తీన్మార్‌ ‌మల్లన్నకు 99,207 వోట్లు వచ్చాయి. కాగా, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంబరాలు మిన్నంటాయి. టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి నృత్యాలు చేశారు.

Leave a Reply