టీఎస్ ఎంసెట్ -2020 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కూకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంసెట్ ఫలితాల కోసం వెబ్సైట్ను లాగిన్ కావాలని సూచించారు. సోమవారం సాయంత్రం ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్లైన్లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు.
ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. 22న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించ నున్నారు. 29 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. నవంబర్ 2న ఇంజినీరింగ్ తుది విడుత సీట్ల కేటాయించనున్నారు. 4న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.