Take a fresh look at your lifestyle.

నేటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు

  • బస్టాండ్‌లలో థర్మల్‌ ‌స్క్రీనింగ్‌, ‌మాస్కులుంటేనే ప్రవేశం
  • సిటీ బస్సులు నడపరాదని నిర్ణయం
  • ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సుదీర్ఘ సమావేశం

రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మళ్లీ ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కొరోనా వైరస్‌ ‌నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో మార్చి 23 నుంచి ఆర్టీసీ బస్సులను నడపరాదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ 4.0 ‌కొనసాగింపులో భాగంగా తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్రాలలో బస్సులు నడిపేందుకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌ ,ఆరెంజ్‌ ‌జోన్ల సంఖ్య పెరగడంతో మంగళవారం నుంచి బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బస్సుల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించారు. కంటెయిన్‌మెంట్‌జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధాని హైదరాబాద్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు సేవల నిర్వహణ, వాటిల్లో పరిమితంగా ప్రయాణికులను అనుమతించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. అలాగే, బస్‌స్టేషన్‌లోకి ప్రవేశించే ప్రతీ ప్రయాణికునికి థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌నిర్వహించడంతో పాటు శానిటైజర్‌లతో చేతులు శుభ్రం చేయాలని నిర్ణయించారు.

మాస్కు ధరించిన ప్రయాణికులను మాత్రమే బస్‌స్టేషన్‌లోనికి అనుమతించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. బస్సులలో 50 శాతం ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్ల వరకే అనుమతించాలని నిర్ణయించారు. వరంగల్‌ ‌నుంచి వచ్చే బస్సులను ఉప్పల్‌ ‌వరకు, సూర్యాపేట, కోదాడ నుంచి వచ్చే బస్సులను ఎల్బీనగర్‌, ‌మహబూబ్‌నగర్‌ ‌వైపు నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్‌, ‌సిద్దిపేట, కరీంనగర్‌ ‌నుంచి వచ్చే బస్సులను జేబీఎస్‌ ‌వరకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు కేంద్రమైన ఎంజీబీఎస్‌కు ఎక్కడి నుంచి కూడా బస్సులను అనుమతించరాదని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, అంతర్రాష్ట బస్సు సర్వీసుల నిర్వహణపై కూడా దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు. కొరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటకతో పాటు పొరుగు రాష్ట్రమైన ఏపీకి కూడా బస్సులను నడపరాదని సమావేశంలో ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే, పొరుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులను నడిపిన పక్షంలోనే ఆర్టీసీ అధికశాతం ఆదాయం వస్తుందని అధికారులు మంత్రికి సూచించినట్లు సమాచారం.

Leave a Reply