కంది పంట పండించిన రైతులు ఆందోళనకు గురికావద్దని, రైతులు విజ్ఞప్తి చేస్తున్న మద్దతు లభించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సీ.నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కందికొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం పైన అదనంగా రూ.200కోట్ల భారం పడుతున్నదని అయినప్పటికీ, ఐకేపీ కేంద్రాల ద్వారా కందిపంటను కొంటామని మంత్రి స్పష్టం చేశారు.రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నందున, దేశంలోని రైతులందరూ తెలంగాణ రైతుల వైపు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని అభినందనలు తెలియచేస్తూ వ్యవసాయమంత్రి వ్యవసాయ రంగ సమస్యలపైన సోమవారం మినిష్టర్ క్వార్టర్స్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 5లక్షల ఎకరాల్లో కంది సాగయ్యిందని చెప్పారు. రూ. 5800ల చొప్పున మద్దతు ధరతో 47500 క్వింటాళ్ల కందులను కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.తెలంగాణకు నిధులు విడుదల చేయడంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అభ్యంతరకంగా ఉన్నాయని వ్యవసాయ మంత్రి విమర్శించారు. కంది పంటను ఇంకా ఎక్కువగా కొనాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం నుంచి అనుమతి లభించనేలేదని అన్నారు.