Take a fresh look at your lifestyle.

చెదరని చిరునవ్వు – మాధవరెడ్డి

  1. “1999‌లో హోం శాఖ నుండి పంచాయితీరాజ్‌ ‌శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలలు కూడా కాకుండానే మార్చి7న ఆయన బాంబుదాడిలో మరణించారు. ఆయనను చంపి నక్సలైట్ల ఏమి సాధించారో తెలియదు కాని భువనగిరి ప్రజలు నల్లగొండ సామాన్యజనం మాత్రం ఒక మంచి మనిషిని, అభివృద్ధి ద్వారానే అంచెలంచెలుగా మన ప్రాంతం బాగుపడుతుందని నమ్మినవ్యక్తిని, ప్రజాస్వామ్య విలువలపట్ల విశ్వాసం ఉన్న నాయకుడిని కోల్పోయారు.”

దివంగతమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మరణించి, (మార్చి7, 2000) అప్పుడే పందొమ్మిది సంవత్సరాలు అయినదంటే నమ్మబుద్దికావడం లేదు. చెదరని చిరునవ్వుతో మందహాసంతో ఎప్పుడు, ఎక్కడా, ఎవరిమీద విసుగు ప్రదర్శించని మాధవరెడ్డి హఠాత్తుగా మాయమైపోయినా తనవారి మధ్యనే నిరంతరం ఉన్నట్లు అనిపిస్తోంది. 2000 మార్చి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం చివరిరోజు మార్చి 7న తెలుగుదేశం – బిజెపి అభ్యర్థులు విజయానికి భువనగిరి పట్టణంలో వీధివీధిలో, వాడవాడలో పాదయాత్రచేసి, సాయంత్రం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనర్సింహ్మాస్వామి వారి బ్రహ్మత్సవాల్లో పాల్గొని హైదరాబాద్‌కు పయనమైన ఆయన నక్సలైట్ల దురాగతచర్య బాంబుదాడికి బలైపోయారు. ఆయనతోపాటు డ్రైవర్‌ ‌నిరంజన్‌ ‌మరియు వ్యక్తిగత భద్రతాధికారి రాంభూపాల్‌రెడ్డి కూడా మరణించారు.

మాధవరెడ్డి స్వయంకృషిని నమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి. ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా స్వయంఉపాధికోసం అప్పుడేవస్తున్న కొత్త టెక్నాలజీ బోరింగ్‌మిషన్‌ ‌వ్యాపారం ప్రారంభించారు. 1981లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో ఆయన స్వగ్రామం భువనగిరి మండల వడపర్తి గ్రామప్రజలు ఆయనను ఒప్పించి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకొన్నారు. సర్పంచ్‌ ఎన్నికల తర్వాత వెంటనే జరిగినా పంచాయితి సమితి ఎన్నికల్లో అప్పటికే భువనగిరి తాలూకాలో రాజకీయంగా యోధానుయోధులైన నాయకులను కాదని మాధవరెడ్డి ని సమితి అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. ఆరోజు నుండి ఆయన ఏ రోజు కూడా రాజకీయంగా వెనుతిరిగి చూడలేదు. 1985 శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో భువనగిరి నుండి ఎన్నికైన ఆయన 1985, 89, 94 మరియు 1999 ఎన్నికల్లో వరుసగా భువనగిరి శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికైనారు.

1989లో ఎన్‌.‌టి.రామారావు క్యాబినేట్‌లో ఎన్నికలకు ముందు ఆయన హోమ్ శాఖ మంత్రిగా పనిచేసారు. 1989 తెలుగుదేశంపార్టి అధికారం కోల్పోయినా తర్వాత ప్రతిపక్షంలో, శాసనసభలో మరియు పార్టీలో కీలకంగా, క్రీయాశీలకంగా వ్యవహరించారు.
1992 నుండి 1994 వరకు పాలిట్‌బ్యూరో సభ్యునిగా, తెలుగుదేశంపార్టీ ప్రధానకార్యదర్శిగా వివిధ విభాగాల జిల్లాల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విజయవంతం కావడానికి ఎన్‌.‌టి.రామారావు, చంద్రబాబునాయుడు కి కుడిభుజంగా పనిచేశారు. ప్రతిపక్షనాయకుడిగా వివిధ జిల్లాలు అనేక ప్రాంతాలు పర్యటించారు. వివిధ జిల్లాల నుండి వచ్చే ముఖ్యకార్యకర్తలందరిని ఆయన పేరుపేరునా పలకరించేవారు.

1994 తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే ఎన్‌.‌టి.ఆర్‌ ‌క్యాబినేట్‌లో మొదటి విడతలో ఆయనకు ఖచ్చితంగా మంత్రిపదవి వస్తుందని అందరూ భావించినా ఆయన పేరు మంత్రి వర్గంలో లేదు. ఇది మాధవరెడ్డి అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఎక్కడకూడా ఆయన సంయమనం కోల్పోలేదు. చంద్రబాబునాయుడు చొరవతో ఆయన వైద్య, ఆరోగ్య శాఖ లభించింది. 1995 పార్టీలో, జిల్లా నాయకత్వంలో ఎన్ని అవమానాలు జరిగినా ఆయన ఎవరిని కూడా పల్లెత్తుమాట అనలేదు. ఆ పరిణామాలన్నీ వైస్రాయి సంఘటనలో చంద్రబాబుకు మాధవరెడ్డి ఖచ్చితంగా వెన్నుదన్నుగా నిలిచే విధంగా దారితీసాయి.

1996 చంద్రబాబు క్యాబినేట్‌లో కీలకమైన హోమ్ శాఖ తోపాటు క్రీడలు, యువజన సర్వీసులు, సినిమాటోగ్రఫీ, చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా వ్యవహరించారు. కీలకమైన పరిణామల్లో, సందర్భాల్లో ఆయనకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన స్నేహితుడిగా నిలిచాడు. పార్టీకార్యక్రమాలను, ప్రభుత్వ కార్యక్రమాలకు శాఖపరమైన కార్యక్రమాలన్నింటిని ఆయన చక్కగా సమన్వయం చేసేవారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ఆయన నుండి చూసి నేర్చుకోవాలి. అధికారులతో, ఉద్యోగులతో, క్రిందిస్థాయి ఉద్యోగులతో సైతం ఆయన చాలా గౌరవంగా వ్యవహించేవారు. తెలుగుదేశంపార్టీ కార్యక్రమాలన్నింటిలో సామాన్య కార్యకర్తగా వ్యవహరిస్తూ, మంత్రులు, ఎమ్‌.ఎల్‌.ఏ.‌లను, యావత్‌ ‌రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులను, కార్యకర్తలనున పేరుపేరునా పలకరించేవారు. పైరవీకారులను చాలాదూరం పెట్టిన మాధవరెడ్డి, రాష్ట్రంలో ఏ మూలనుండైనా సామాన్య కార్యకర్తకు అయినా, సామన్య పౌరుడి వచ్చి సమస్య చెప్పినా వెంటనే స్పందించి కావలసిన పని చేసిపెట్టవారు. నక్సలైట్ల ప్రాబల్యం వీపరితంగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాలో విసృత్తంగా వారి కార్యక్రమాలు సాగుతున్న సమయంలో కూడా ఆయన రాత్రి పగలు అనకుండా గ్రామగ్రామాన పర్యటించారు. జన్మభూమి కార్యక్రమాల్లో నల్లగొండ జిల్లాలో ఆయన పర్యటించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.

1999లో హోమ్ శాఖ నుండి పంచాయితీరాజ్‌ ‌శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలలు కూడా కాకుండానే మార్చి7న ఆయన బాంబుదాడిలో మరణించారు. ఆయనను చంపి నక్సలైట్ల ఏమి సాధించారో తెలియదు కాని భువనగిరి ప్రజలు నల్లగొండ సామాన్యజనం మాత్రం ఒక మంచి మనిషిని, అభివృద్ధి ద్వారానే అంచెలంచెలుగా మన ప్రాంతం బాగుపడుతుందని నమ్మినవ్యక్తిని, ప్రజాస్వామ్య విలువలపట్ల విశ్వాసం ఉన్న నాయకుడిని కోల్పోయారు. మాధవరెడ్డి ఏనాడు పగనో, ప్రతికారాన్నో కోరుకున్నవారు కాదు. తీవ్రవాదం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం వంటి చర్యలను అదుపుచేస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా శాంతిభద్రతలు అదుపులో ఉండాలని బలంగా విశ్వసించిన వ్యక్తి. నక్సలైట్లు ఆయనను బలితీసుకున్నప్పుడు రాష్ట్రనలుమూలలనుండి వ్యక్తమయిన నిరసన, ఆందోళన, ఆవేదన ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పింది. సమైక్యరాష్ట్రంలో హోమ్ శాఖ మంత్రిగా ఆయన సేవలు అందించారు కాబట్టి ఇరురాష్ట్రాల్లోను ఆయన జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలి. ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహ రించడమే ఆయనకు అర్పించే నివాళి.

kalaeryu suresh
కాలేరు సురేష్‌
‌కన్వీనర్‌, ‌మాధవరెడ్డి స్మారక సమితి. 9866174474
(కీ।।శే।। మాధవరెడ్డి గారి మాజీ ప్రజాసంబంధాల అధికారి)

Leave a Reply