- నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంత్రి కెటిఆర్ సమీక్ష
- ఖైరతాబాద్ ప్రాంతంలో ముంపు బాధితులకు వరద సాయం అందజేసిన మంత్రి
నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల్లో ఎమ్మెల్యేలు ముందుండాలని మంత్రి కెటిఆర్ అన్నారు. సంక్షోభ సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎన్జీవోలు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ముంపు బాధితులకు అండగా నివాలని మంత్రి కోరారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు కోసం మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో సవి•క్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. రానున్న పది రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం ముంపునకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలి అని చెప్పారు.
వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను కూడా పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో రిస్టొరేషన్ పనులను పర్యవేక్షించాలి అని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ, శివారు ప్రభావిత ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు లక్షల కుటుంబాలకు ఇండ్ల వద్దనే రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.550 కోట్లు కేటాయించారని, అవసరమైతే ఇంకా సహాయం అందజేస్తామని సీఎం ప్రకటించారన్నారు. వరదల వల్ల ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు.
ఖైరతాబాద్ ప్రాంతంలో ముంపు బాధితులకు వరద సాయం అందజేసిన మంత్రి
ఖైరతాబాద్‌లోని ఎంఎస్ మక్తా, రాజు నగర్లో మంగళవారం మధ్యాహ్నం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 10 వేల సాయాన్నిఅందించారు. ఒక్కో కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. వారికి రూ. 10 వేల చొప్పున నగదు అందజేశారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.