Take a fresh look at your lifestyle.

వడ్లు కొంటామనే దాకా పోరాడుతాం

  • బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు
  • తెలంగాణ కోసం పోరాడినోళ్లం ..వడ్ల కోసం పోరాడలేమా
  • ఇక టిఆర్‌ఎస్‌ అం‌టే తెలంగాణ రైతు పార్టీ
  • బండి సంజయ్‌ ‌కాదు.. తొండి సంజయ్‌
  • సిరిసిల్ల ధర్నాలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి

కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్‌ ‌మెడలు వంచాము.. వరి కొనుగోలు కోసం బీజేపీ మెడలు వంచలేమా అని కేటీఆర్‌ అన్నారు. రైతుల వెంటే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల మహా ధర్నాలో కేటీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. బీజేపీ నేత బండి సంజయ్‌ ‌కాదు తొండి సంజయ్‌. ‌యాసంగిలో వరే వేయండి అంటున్న తొండి సంజయ్‌. ‌బండి సంజయ్‌ను గెలిపించి నోళ్లకి ఓ దండం. ఇలాంటి పిచ్చోళ్లని పార్లమెంట్‌కి పంపించారు. హిందూ-ముస్లిం పేరుతో ఆగం చేయటమే బీజేపీ పనని మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్‌ ‌హెచ్చరించారు.

సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్ల తర్వాత రైతులు రోడ్డెక్కారని తెలిపారు. ఏడు దశాబ్దాల వెనుకబాటును ఏడాదిలో సీఎం కేసీఆర్‌ ‌మార్చారని కొనియాడారు. ఏడేళ్ల వరుస కరవు నుంచి ఏడేళ్లలో అభివృద్ధిబాటలో నిడిపించారని కేటీఆర్‌ ‌తెలిపారు.  చిన్ననీటి వనరుల రూపురేఖలు సీఎం మార్చారని ప్రశంసించారు. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో చెరువులు తెగకుండా చూసుకున్నామన్నారు. 3 కోట్ల ఆహారధాన్యాలను తెలంగాణ పండిస్తున్నదని తెలిపారు. అన్నీ అమ్మటమే ప్రధాని మోదీ ఆలోచన అని దుయ్యబట్టారు. ప్రపంచంలో అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్ట్ ‌కాళేశ్వరమని పేర్కొన్నారు. డెల్టాలో కనిపించే పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయన్నారు. ఆకలి సమస్య ఎదుర్కుంటున్న దేశాలలో ముందంజలో భారత్‌ ఉం‌దని తెలిపారు.

గత 75 ఏళ్లలో దేశాన్ని ఎలా నడిపించారో బీజేపీ, కాంగ్రెస్‌ ‌సమాధానం చెప్పాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తుందని కేటీఆర్‌ అన్నారు. ఉద్యమం నాటి జోష్‌ ‌మళ్లీ వొచ్చింది. ఇక టిఆర్‌ఎస్‌ అం‌టే తెలంగాణ రైతు పార్టీ అని కెటిఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఎరువులు, విత్తనాలకు లైన్లు కట్టే పరిస్థితి లేదు. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందిస్తున్నాం. పాలకుల మనసు బాగుంటే అన్ని బాగుంటాయని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. చెరువులకు రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టి భూగర్భ జలాలను పెంచుకున్నామని తెలిపారు. నడి ఎండకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయని కేటీఆర్‌ ‌తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీ పడి కేసీఆర్‌ ‌నిర్మించారు. రైతులకు ఏ కష్టం రాకుండా సీఎం కేసీఆర్‌ ‌చూసుకుంటున్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను తెలంగాణ మించిపోయింది.

సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్లు గ్రామాల బాట పట్టి వ్యవసాయం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ‌రైతు పక్షపాత విధానాల వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. దిక్కు మాలిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వొచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్‌ ‌సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పింది అని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్‌ ‌తపన అని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్‌ ‌తొండి సంజయ్‌లాగా మారారు అని ధ్వజమెత్తారు. బండి పాదయాత్ర చేసినప్పుడు మన రైతు వేదికల్లో బస చేశారని గుర్తు చేశారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉంది.. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

తెలుగు వార్తలు, Telugu News Headlines Breaking News Now, Today Hilights, Prajatantra News

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. మన రైతుబంధును కేంద్రం సహా 11 రాష్టాల్రు కాపీ కొట్టాయన్నారు. రైతు చనిపోయిన పది రోజుల్లోపై రైతుబీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాము. తెలంగాణలో ప్రాజెక్టుల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి పెరగగానే కేంద్రం కొర్రీలు పెడుతోంది అని కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. మాకు వరి పంట వేయడం తప్ప వేరేది రాదని మన రైతులు అంటున్నారు. కేంద్రం మాత్రం వరి వద్దు అంటోంది. పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా..? అని ప్రశ్నించారు. దేశానికి ఒక్క విధానం ఉండనవసరం లేదా? అని అడిగారు. బీజేపీ వోట్ల కోసం రాజకీయాలు చేస్తోందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. చిల్లర వోట్ల కోసం రైతుల జీవితాలతో బీజేపీ చలి మంటలు కాచుకుంటుందని నిప్పులు చెరిగారు. బీజేపీ రాజకీయాలకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు.

Leave a Reply