- సకాలంలో చర్యలు తీసుకోవడంతోనే సాధ్యమయ్యింది
- ఆక్సిజన్ ప్లాంట్ అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
రాష్ట్రంలో కొరోనా మహమ్మారిని దాదాపుగా అదుపు చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ పక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. అధికారులు పక్కాగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమిక్షించి వారికి మార్గనిర్దేశం చేసిందన్నారు. సనత్‌నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు 7 అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్‌లను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..మహీంద్రా గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషమని అన్నారు.
భవిష్యత్‌లో మహీంద్రా గ్రూప్ మరిన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ‘మహీంద్రా గ్రూప్ తెలంగాణలో ఒకరంగానికే పరిమితం కాలేదు. జహీరాబాద్‌లో లక్ష పైచిలుకు ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తుంది. హైదరాబాద్‌లో టెక్ మహీంద్రా హెడ్ క్వార్టర్స్ ఉంది. వరంగల్‌లో కూడా వారి కార్యకలాపాలను విస్తరించారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో భాగంగా తెలంగాణలో మహీంద్రా యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. ఇలా ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా ఉంటుంది. ఇవాళ ఏడు అంబులెన్స్‌లు, రూ. కోటి విలువైన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాను’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.