Take a fresh look at your lifestyle.

డబుల్‌ ఇళ్ల పరిసరాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలి

  • ఇల్లు కట్టించి, కల్యాణలక్ష్మి అందిస్తున్న ఏకైక సిఎం కెసిఆర్‌
  • అం‌బేడ్కర్‌ ‌నగర్‌లో డబుల్‌ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

దేశంలో తెలంగాణలో మాత్రమే పేదలకు ఉచితంగా ఇల్లు, పెళ్లి చేసుకోవడానికి కల్యాణలక్ష్మి అందించి ఇస్తున్న ఏకైక సిఎం కెసిఆర్‌ ‌మాత్రమేనని మంత్రి కెటిఆర్‌ అన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఇదొక్కటే అన్నారు. పేదలకు అందించిన ఈ కాలనీల్లో మొక్కలు పెంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ ‌నగరంలోని అంబేద్కనగర్‌లో నిర్మించిన డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శనివారం ప్రారంభించారు. నగర వాసుల కోసం ప్రభుత్వం రూ.28 కోట్లతో 330 డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను ఒక్కో ఇంటిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో ఇండ్లను నిర్మించింది. మంత్రి కెటిఆర్‌ ఇం‌డ్లను ప్రాంభించిన అనంతరం లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

అంతకు ముందు డబుల్‌ ఇం‌డ్ల ప్రారంభోత్సవానికి వొచ్చిన కేటీఆర్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, బోనాలతో ఆహ్వానించారు. నగరం నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్‌ ‌నగర్‌లో డబుల్‌ ‌బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆనందం చూస్తుంటే తన గుండె సంతోషంతో ఉప్పొంగి పోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అంబేడ్కర్‌ ‌నగర్‌ ‌రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

Minister KTR inaugurated the double houses in Ambedkar Nagar

ఇంత అద్భుతమైన ఇండ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే స్థలంలో ప్రయివేటు అపార్ట్‌మెంట్‌ ‌కట్టి ఉంటే కోటిన్నర అయి ఉండేదని, కానీ ఒక్క పైసా తీసుకోకుండా సీఎం కేసీఆర్‌ ఇం‌డ్లు నిర్మించి ఇచ్చారని ఆడబిడ్డలు చెబుతున్న మాటలతో గుండె సంతోషంతో ఉప్పొంగిపోయిందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా కష్టంతో కూడుకున్న పని. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ ఇల్లు కట్టించి ఇచ్చి, ఆడ పిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నారు.

పేదల కోసం ఇండ్లు కట్టించి ఇస్తున్న కార్యక్రమం దేశంలో ఎక్కడా కూడా లేదు. జీహెచ్‌ఎం‌సీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రూ. 9 వేల కోట్లతో ఇండ్లు కట్టించి ఇస్తున్న నగరం భారతదేశంలో హైదరాబాద్‌ ఒక్కటేనని తెలిపారు. పారదర్శకంగా ఇండ్ల పంపిణీ జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అంబేడ్కర్‌ ‌నగర్‌ ‌వాసులకు బస్తీ దవఖానాతో పాటు ఫంక్షన్‌ ‌హాల్‌ ‌నిర్మించి ఇస్తాం. అవసరమైతే ఇంకొన్ని ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్‌ ‌చెప్పారు. ప్రజల నుంచి ప్రభుత్వం ఆశించేది రెండు పనులు మాత్రమే అని స్పష్టం చేశారు. ఒకటి పరిశుభ్రత, రెండోది పచ్చదనంపై దృష్టి అని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రికి చెట్లంటే ఎంత ఇష్టమో వి•కు తెలుసు.

కేసీఆర్‌ ‌సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తెలంగాణలో 23 నుంచి 28 శాతానికి పచ్చదనం పెరిగిందన్నారు. ఇంకా హైదరాబాద్‌ ‌నగరంలో చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంచే బాధ్యతను ఆడబిడ్డలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హుస్సేన్‌ ‌సాగర్‌ ఒకప్పుడు మురికికూపంగా ఉండేది. ఇప్పుడిప్పుడే దాన్ని బాగు చేసుకుంటున్నాం. సాగర్‌ ‌పరిసరాల్లో చెత్త వేయనీయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నగరాన్ని, మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

అంబేడ్కర్‌ ‌నగర్‌ ‌మోడల్‌ ‌కాలనీగా తయారు కావాలని కేటీఆర్‌ అన్నారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ ఆడబిడ్డలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ క్రమంలో మహిళలతో మాట్లాడిన కేటీఆర్‌.. ‌డబుల్‌ ‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా ఉందని అడిగారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మురికివాడల్లో ఉన్న తమకు అద్భుతమైన ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని లబ్దిదారులైన మహిళలు కేటీఆర్‌కు చెప్పి.. కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, జీహెచ్‌ఎం‌సీ మేయర్‌తో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply