Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ అభివృద్ధిపై కేంద్రం తీరు దారుణం

  • ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు మోకాలడ్డుతున్నది
  • కరీంనగర్‌, ‌సుచిత్రల వద్ద పై వంతెనలకు దక్కని మోక్షం
  • అనుమతుల కోసం నాలుగేళ్లుగా ఎదరుచూపు
  • బాలానగర్‌ ‌ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌
  • ‌వనపర్తి కూలీ శివమ్మతో రిబ్బన్‌ ‌కట్‌ ‌చేయించి ప్రారంభోత్సవం
  • నిరసనలో భాగంగా హుస్సేన్‌ ‌సాగర్‌లో సిలిండర్‌, ‌బైక్‌ ‌పడేసిన వారిపై చర్యలకు కెటిఆర్‌ ఆదేశాలు

జూబ్లీ బస్టాండ్‌ ‌నుంచి తూంకుంట ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వరకు నిర్మించాలనుకున్న భారీ ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణానికి కేంద్రం మోకాలడ్డుతూ, అనుమతులు ఇవ్వడం లేదని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. ఈ ఫ్లై ఓవర్‌ ‌నిర్మించడం ద్వారా కరీంనగర్‌ ‌రూట్లో ఉన్న ట్రాఫిక్‌ ఇబ్బందులు అధిగమించాలన్న లక్ష్యాన్ని నాలుగేండ్లుగా అమలు చేయలేకపోతున్నామని అన్నారు. దీనికి కేవలం కేంద్రం తీరే కారణమని మండిపడ్డారు. ఇక్కడ కంటోన్మెంట్‌ ఏరియా ఉండడంతో ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణంలో కేంద్రం అనుమతులు తప్పనిసరని అన్నారు. ఇదిలా వుంటే నగరంలో మరో ఫ్లై ఓవర్‌ అం‌దుబాటులోకి వొచ్చింది. బాలానగర్‌ ‌చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌మంగళవారం ఉదయం ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక ద్వారా..ఫ్లై ఓవర్లు, అండర్‌ ‌పాస్‌లు నిర్మిస్తున్నామని అన్నారు. కూకట్‌పల్లి నియోజక వర్గం పరిధిలో రూ. వెయ్యి కోట్ల పై చిలుకు డబ్బులతో రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు, అండర్‌ ‌పాస్‌ల నిర్మాణం జరిగిందని, హైదరాబాద్‌ ‌ప్రజలకు మరింత మెరుగైన ట్రాఫిక్‌ ‌వ్యవస్థను అందిస్తామన్నారు. రవాణా వ్యవస్థను సులభతరం చేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎం‌సీ, హెచ్‌ఎం‌డీఏ సంయుక్తంగా కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. బాలానగర్‌ ‌పరిధిలో రహదారుల విస్తరణ కూడా చేపడుతామన్నారు. ఫతే నగర్‌ ‌బ్రిడ్జి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు.

ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు, జూబ్లీ బస్టాండ్‌ ‌నుంచి తుర్కపల్లి(ఓఆర్‌ఆర్‌) ‌దాకా స్కైవేలు నిర్మించేందుకు గత నాలుగేండ్ల నుంచి కసరత్తు జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అయితే రక్షణ రంగ సంస్థలకు చెందిన భూములు ఉండటం వల్ల.. కేంద్ర ప్రభుత్వ సహాయక నిరాకరణ వల్ల ఆ పనులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండు స్కైవేల నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. కేంద్రం హైదరాబాద్‌ ‌ప్రజల బాధలను అర్థం చేసుకోలేకపోతుందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. బాలానగర్‌ ‌ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లై ఓవర్‌ ‌రిబ్బన్‌ ‌కటింగ్‌ను వనపర్తి జిల్లాకు చెందిన కూలీ శివమ్మతో చేయించారు. గత రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణ పనుల్లో ఆమె నిమగ్నమైంది. శివమ్మ చేతుల మిదుగా దీనిని ప్రారంభించుకోవడంతో అందరూ హర్షాతి రేకాలు వ్యక్తం చేశారు. లక్షలాది మంది కార్మికులు మన ప్రాజెక్టుల్లో నిమగ్నమై పని చేశారు. వారిని గౌరవించుకోవాలనే సీఎం కేసీఆర్‌ ‌సూచనతో.. వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కూలీతో రిబ్బన్‌ ‌కటింగ్‌ ‌చేయించామని కేటీఆర్‌ ‌తెలిపారు.

హైదరాబాద్‌ ‌నగర అభివృద్ధిలో పాలు పంచుకునే కూలీలను గౌరవించుకుంటామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. బాలానగర్‌ ‌ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్‌ ‌ఘన నివాళులర్పించారు. బాలానగర్‌ ‌వంతెనను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ ‌ప్రసంగించారు. బాలానగర్‌ ‌వాసుల 40 సంవత్సరాల కల నెరవేరిందన్నారు. ట్రాఫిక్‌ ‌సమస్యతో బాలానగర్‌ ‌వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ రహదారి గుండా వెళ్లేవారికి కనీసం 30 నిమిషాలపాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదని, ఇప్పుడు ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ ‌కష్టాలు పూర్తిగా తొలగిపోయాయన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్‌, ఎమ్మెల్సీ నవీన్‌ ‌రావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌కు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ భారీ ఫ్లై ఓవర్‌ను మూడు సంవత్సరాల 11 నెలల సమయంలో పూర్తి చేశారు. 1.13 కిలోమిటర్ల దూరం.. 24 మిటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్‌ ‌సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్‌ ‌కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మిదుగా సికింద్రాబాద్‌-‌కూకట్‌పల్లి-అమిర్‌పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది.

నిరసనలో భాగంగా హుస్సేన్‌ ‌సాగర్‌లో సిలిండర్‌, ‌బైక్‌ ‌పడేసిన వారిపై చర్యలకు కెటిఆర్‌ ఆదేశాలు
పెరిగిన గ్యాస్‌ ‌సిలిండర్‌, ‌పెట్రోల్‌ ‌ధరలకు నిరసనగా ఇటీవల కొంతమంది హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వద్ద కొంతమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ.. గ్యాస్‌ ‌సిలిండర్‌ను, బైక్‌ను సాగర్‌లో తోసేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి.. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రధాన అంశమే అయినప్పటికీ.. బాధ్యతారాహిత్యంగా బైక్‌లను, సిలిండర్లను చెరువుల్లో తోసేయడం సరికాదని కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహముద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ ‌రెడ్డికి కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు.

Leave a Reply