Take a fresh look at your lifestyle.

బిజెపి సమాజంలో తక్కువ..సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ

  • దుబ్బాకలో కాంగ్రెస్‌, ‌బిజెపిలకు డిపాజిట్లు కూడా దక్కవు
  • మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటిఆర్‌

‌దుబ్బాక ఉప ఎన్నికల్లో గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతో టిఆర్‌ఎస్‌ ‌గెలవబోతున్నదని  టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి కుట్రలు, కాంగ్రెస్‌ ఎత్తులు పనిచేయవన్నారు. సిఎం కెసిఆర్‌ ‌ప్రచారంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌వి•డియాతో చిట్‌చాట్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ ‌మాట్లాడుతూ దుబ్బాక చైతన్యాల గడ్డ అని, రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని అన్నారు. గతంలో తాను దుబ్బాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించానని, అక్కడి ప్రజల నాడి తనకు బాగా తెలుసునని, దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు వస్తుందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ‌భారతీయ జనతా పార్టీలు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నారు.

సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే.. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ ‌పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీపై కేటీఆర్‌ ‌విమర్శలు గుప్పించారు. ఆ పార్టీది కచ్చితంగా వాట్సాప్‌ ‌యూనివర్సిటీయే అని ఎద్దేవా చేశారు. గోబెల్‌ ‌బతికి ఉంటే బీజేపీ దగ్గర పాఠాలు నేర్చుకునే వారని అన్నారు. బీజేపీ తీరు సమాజంలో తక్కువ..సామాజిక మాధ్యమంలో ఎక్కువ అన్నట్టు ఉందన్నారు. వాట్సాప్‌ ‌యూనివర్సిటీ నడుపుతూ తప్పుడు సందేశాలు పంపుతున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నింటికీ డబ్బులు తామే ఇస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. రఘునందన్‌ ‌రావు ఇంట్లో దొరికిన డబ్బు మాత్రం తమది కాదంటున్నారని, కానీ ఆ నగదుకు సంబంధించిన సాక్ష్యాలు బయటపడిన విషయం అందరికీ తెలుసు అని కేటీఆర్‌ ‌చెప్పారు. దుబ్బాకలో తమకు ప్రత్యర్థులు ఎవ్వరూ లేరని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply