అందుకు ప్రతీక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
వనస్థలిపురంలో ప్రారంభించిన మంత్రి కెటిఆర్
పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. వనస్థలిపురం పరిధిలోని జైభవాని నగర్‌లోని రైతుబజార్ వద్ద నిర్మించిన 324 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్లను పేదలకు నిర్మించి ఇవ్వలేదని అన్నారు. వనస్థలిపురంలో ఇదే ఇల్లు కొనుగోలు చేయాలంటే రూ.40-50 లక్షలు అవుతుందన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని కేటీఆర్ స్పష్టం చేశారు. పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా ఈ ఇండ్లను నిర్మించి ఇస్తున్నాం. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ఇలాంటి ఇండ్లు నిర్మించలేదు. రెండు పడకగదులు, ఒక హాల్, కిచెన్‌తో పాటు రెండు బాత్రూమ్లను నిర్మించాం. ఒక్కో ఇంటికి రూ. 9 లక్షల ఖర్చు పెట్టి నిర్మించామని తెలిపారు. దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే ప్లాట్‌ను పేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు.