- పలువురికి గాయాలు
- ఉద్రిక్తతల మధ్య నిమ్జ్‌లో తొలి ‘వేమ్ కంపెనీ’కి మంత్రి భూమి ఫూజ
సంగారెడ్ది, ప్రజాతంత్ర, జూన్ 22 : ‘నిమ్జ్’ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం మంత్రి కెటిఆర్ పర్యటన సందర్భంగా 17 గ్రామాలను పోలీసులు నిర్భందించారు. కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలిరాగా వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురికి గాయాలయ్యాయి. బుధవారం ఝరాసంగం మండలం చీలపల్లిలో జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టులో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో 550 ఎకరాలలో వేమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా నిమ్జ్ భూ నిర్వాసితులు, భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు గంగ్వార్ వద్ద లాఠీ చార్జీ చేశారు. ఝరాసంగం మండలంలోని ఎల్గోయి, బర్దిపూర్, చిలిపల్లి, న్యాల్ కాల్ మండలంలోని ముంగి, ముంగి తాండా తాండా, హద్నుర్, రేజింటల్, మొల్కలపడు, మిర్జాపూర్, (న్)మల్కాపూర్, గుంజాటి, రుక్మాపూర్ తాండ, రామతీర్థం తదితర గ్రామాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఎక్కడికక్కడా రైతులను కట్టడి చేశారు. రైతులను అరెస్టు చేసి పోలీస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతులను అరెస్ట్ చేసి ఝరాసంగం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే ఆయా గ్రామాలలో హోటళ్లను, కిరాణం షాపులను, సైతం పోలీసులు బంద్ చేయించారు. జహీరాబాద్ నుండి మచున్నూర్, బర్దిపూర్ క్రాస్ రోడ్డు నుండి నిమ్జ్ భూమి పూజ చేసే స్థలం వరకు అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైతులను సైతం పొలాలకు వెళ్లనివ్వ లేదు. అయితే రైతులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ముందుకు దూసుకు రాగా గంగ్వార్ వద్ద పోలీసులు రైతులు, గ్రామస్తులపై లాఠీ చార్జీ చేశారు. లాఠీ ఛార్జిలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. రాంచందర్‌ను, టిజెఎస్ నాయకులు ఆశప్పతోపాటు పలువురు నాయకులను, ఆందోళన కారులను పోలీసులు ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు.