- క్రీడాకారులు, ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగం
- 18 నుంచి సిద్ధిపేటలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు
- క్రీడాకారులకు ఏ లోటు రావొద్దు..
- ఫుట్‌బాల్ కోర్టు నిర్మాణంపై మంత్రి హరీష్‌రావు సమీక్ష
అన్ని క్రీడలకు నిలయంగా సిద్ధిపేట మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ఫుట్‌బాల్ కోర్టు పనులను మంత్రి పరిశీలించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వాలీబాల్ క్రీడా ఏర్పాట్లపై కావల్సిన వసతులు, క్రీడాకారుల వసతులపై వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాల మైదానంలో ఫుట్‌బాల్ కోర్టు చుట్టూ రన్నింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అతి కొద్ది కాలం త్వరలోనే సిద్ధిపేటలో ఫుట్‌బాల్ కోర్టు సిద్ధం కానున్నదనీ, ఇందుకోసం రూ.2.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఫుట్‌బాల్ కోర్టు చుట్టూ రన్నింగ్ ట్రాక్ నిర్మాణం చేయడానికి ప్రతిపాదన పెట్టినట్లు, ఈ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుతో పోలీస్ శిక్షణ తీసుకునే వారికి, రన్నింగ్ పోటీలకు సిద్ధం అయ్యే ఉద్యోగ శిక్షణార్థులకు చాలా ఉపయోగకరమని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
ఈ నెల 18 నుంచి రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా వాలీబాల్ పోటీలను వాలీబాల్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రీడా పోటీలు 4 రోజులు నిర్వహించనున్నట్లు, క్రీడాకారులకు అవసమయ్యే అన్నీ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, వారికి వసతి, భోజనం ఏర్పాట్లు మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి సూచించారు. ఈ సమీక్షలో డీవైఎస్వో-డిప్యూటీ డీఈఈ సాట్స్ నాగేందర్, స్పోర్ట్ టెక్ జనరల్ మేనేజర్ కె.సుధీర్, ఆథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, ఆథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సిద్ధిపేట స్పోర్టస్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరామ్, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి, ఇతర క్రీడా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఆథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన సిద్ధిపేట జిల్లా 10 మంది క్రీడాకారులైన విజేతలను వారి బహుమతులతో సత్కరించి మంత్రి వారిని అభినందించారు.
సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్..పాత బస్టాండ్ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి
సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్ నిర్మింప చేసేందుకు, స్థానిక పాత బస్టాండ్ ఆధునీకరణపై రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్‌కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసి అధికారులకు మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో ఆర్టీసీ ఈఈ రాంబాబు, ఆర్ఎం రాజశేఖర్, ఆర్కిటెక్ట్ ప్రీతమ్ రెడ్డిల కలిసి పరిశీలించారు. ఏడాది లోపు మోడ్రన్ బస్టాండ్ అందుబాటులో తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసి అధికారులను మంత్రి ఆదేశించారు.
1976లో నిర్మించిన బస్టాండులో నూతనంగా రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులతో మోడ్రన్ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆర్టీసి అధికార వర్గాలతో మంత్రి చర్చించారు. బస్టాండుకు వొచ్చే ప్రయాణికులకు మోడ్రన్ టాయిలెట్స్, క్యాంటీన్, దుకాణ సముదాయం, బస్టాండులో దాదాపు 20 వరకూ ప్లాట్ ఫామ్స్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్టీసి అధికార వర్గాలు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వార్డుల్లో సిసి రోడ్ల పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
పట్టణంలోని 26వ వార్డు, 18వ వార్డు నుంచి 26వ వార్డు వరకూ మొత్తం రూ.6.50 కోట్ల రూపాయల వ్యయంతో 26వ వార్డులో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్ల పునరుద్ధరణ, సిసి రోడ్ల నిర్మాణ పనులకు, అలాగే పట్టణంలోని 15, 13వ వార్డు నుంచి 26వ వార్డు వరకూ రూ.25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు లలితా పరమేశ్వరీ ఆలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా స్వచ్ఛ సర్వేక్షణ్- 2021లో పాల్గొని సిద్ధిపేట మునిసిపాలిటీకి సరైన ఫీడ్ బ్యాక్ ఇచ్చి పట్టణ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని మంత్రి సూచించారు. మునిసిపల్ కమిషనర్ రమణాచారి, డిపిఆర్వో దశరథం ఆదేశాల మేరకు సాంస్కృతిక శాఖ కళాకారులు కళాంజలి రాజేష్ ఆధ్వర్యంలో చేపట్టిన పాటలు అక్కడి వారందరినీ అలరించాయి. ఈ మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్-2021 సాంస్కృతిక శాఖ కళాకారుల వాహనాన్ని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, సుడా డైరెక్టర్, వార్డు కౌన్సిలర్ తెల్జీరు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.