
గ్రామ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు
సిద్ధిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. తన స్వగ్రామం చింతమడక గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గ్రామస్తులకు పిలుపునిచ్చారు. సీఏం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం చింతమడక ఆదర్శ గ్రామ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కొత్త గ్రామ నిర్మాణానికి ముందుకొచ్చిన చింతమడక గ్రామస్తుల ఐక్యత హర్షనీయమని మంత్రి కొనియాడారు. సిద్ధిపేట జిల్లా రూరల్ మండలంలోని చింతమడక మధిర గ్రామాలైన అంకంపేట, దమ్మ చెరువు, చింతమడకలో గ్రామ పునర్నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు చింతమడక గ్రామానికి మంత్రి చేరుకోగానే గ్రామస్తులు, యువత మంత్రి పై గులాబి పూల వర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో అడుగడుగునా నీరాజనం పట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎర్రవల్లి గ్రామం తరహాలోనే చింతమడక గ్రామ రూపు రేఖలు మారబోతున్నట్లు, దేశానికే ఆదర్శంగా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు వెలియనున్నాయని వెల్లడించారు. ఆదర్శ నమూనాలో ఇళ్లు నిర్మాణం చేయబోతున్నామని పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. స్వయం ఉపాధి కోసం ఇచ్చే రూ.10 లక్షలు దశల వారీగా అందిస్తున్నట్లు, అందరూ ఒకే విధంగా అంశాన్ని ఎంచుకోవద్దని సూచించారు. ఫౌల్ట్రీ ఫామ్, డైరీ ఫామ్, వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలని, గ్యాసుతో నడిచే వాహనాలు కొనుగోలు చేయాలని సూచించారు.
పుట్టిన ఊరికి రుణం తీర్చుకునేందుకు సీఏం స్వగ్రామాన్ని ఆదర్శంగా నిర్మించాలనే లక్ష్యాన్ని అందరీ సమన్వయంతో నెరవేరుద్దామని గ్రామస్తులను కోరారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్లు ఖాళీ చేయాలని వర్షా కాలం వచ్చే వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని తిరిగి సీఏం కేసీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయిద్దామని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 5 లక్షలు ఖర్చు పెడుతున్నదని, ఇళ్లు మరింత పెద్దగా నిర్మించుకోవాలంటే.. మీ స్వంత డబ్బులు, లేదా మీకు ఉపాధి కోసం ఇచ్చే రూ.10 లక్షల నుంచి రూ.1 లక్ష లేదా 2 లక్షల రూపాయలు ఖర్చు చేయవచ్చని వివరించారు. ఎర్రవల్లి గ్రామంలోని అనుభవాల దృష్ట్యా చింతమడక గ్రామస్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆదర్శ గ్రామంగా రూపుదిద్దేలా చర్యలు చేపట్టినట్లు, ఇందు కోసం అందరూ గ్రామస్తులు సహకరించాలని మంత్రి కోరారు. ఇళ్లు నిర్మించాలంటే కొంత మంది ఇళ్లు కూల్చి వేయాలని, అవసరమైన స్థలాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుందని, రోడ్లు పెద్దగా ఉంటాయని, అందు కోసం స్థలం ఎక్కువగా అవసరం ఉంటుందని అవగాహన కల్పిస్తూ వివరించారు. దమ్మ చెరువు, అంకంపేట గ్రామాల్లో ఏలాంటి సమస్యలు లేవంటూ రెండు గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసే నివాసం ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంకంపేటలో 45, దమ్మ చెరువులో 55 గుడిసెలు నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు దమ్మ చెరువు గ్రామ ప్రజలతో కలిసి గుడిసెలు పరిశీలించి అన్నీ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, పల్లె ప్రగతి-మండల ప్రత్యేక అధికారి-డీఎఫ్ఓ శ్రీధర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, ఏంపీడీఓ సమ్మిరెడ్డి, సర్పంచ్ హంస కేతన్ రెడ్డి, ఏంపీటీసీ, ప్రత్యేక అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.