Take a fresh look at your lifestyle.

కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలి…..

  • స్వీయ నియంత్రణతో… కొరోనా నిబంధనలు పాటిస్తూ పండుగా జరుపుకోవాలి
  • రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్‌రావు ఉగాది శుభాకాంక్షలు

రాష్ట్ర, సిద్ధిపేట జిల్లా ప్రజలు స్వీయ నియంత్రణతో, కొరోనా నిబంధనలతో ఉగాది పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. శ్రీ ప్లవనామ తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలకు మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ అన్ని శుభాలే జరగాలనీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలు, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తోందన్నారు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంతో వారు సంతృప్తిగా ఉన్నారన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని ముద్దాడాయనీ సంతోషం వ్యక్తం చేశారు. తొలిసారిగా మండు టెండల్లో యాసంగి పంటకు నీళ్లు ఇచ్చాననే గొప్ప సంతృప్తినిచ్చిందని చెప్పారు.

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో ఆనందంతో వుండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నానన్నారు. ఈ కొత్త సంవత్సరం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నట్లు ఆకాంక్షించారు. కొరోనా ఉన్న నేపథ్యంలో మనం కూడా క్రమశిక్షణతో ఇండ్ల నుంచి బయటకు రాకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని అభిప్రాయపడ్డారు. ఇంట్లోనే ఉండి భగవంతున్ని ప్రార్థిస్తూ.. భగవన్నామస్మరణ చేద్దామన్నారు. అందరూ మాస్క్‌లు ధరిస్తూ కొరోనా నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు.

Leave a Reply