Take a fresh look at your lifestyle.

అన్ని వర్గాలు వాణీదేవి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి

  • రాంచందర్‌రావు పట్టభద్రులను చిన్నచూపు చూశారు
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ :
‌హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గత ఎన్నికలలో బీజేపీ ఎమ్మెల్సీగా గెలుపొందిన రాంచందర్‌రావు పట్టభద్రులను చిన్నచూపు చూశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి తరఫున ప్రచారం నిర్వహించిన మంత్రి హరీష్‌రావు గురువారం మల్కాజ్‌గిరిలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికలలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పరిగి, తాండూరు, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలలో గ్రాడ్యుయేట్లను కలవలేదని అక్కడి వారు చెబుతున్నారని పేర్కొన్నారు. 2018లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా పోటీ చేసిన రాంచందర్‌రావు గెలిస్తే మధ్యలో ఈ పదవి వదిలి వెళ్లిపోయేవాడేననీ, ఇప్పుడు గెలిచినా మళ్లీ మధ్యలో వదిలి వెళ్లిపోడన్న గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు.

సురభి వాణీదేవి మాజీ ప్రధాని పివి కుమార్తెగా, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన విద్యావేత్త అనీ, విద్యారంగంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి అనీ లక్ష మంది పట్టభద్రులను సమాజానికి అందించిన ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఏ ప్రాతిపదికన వోటు వేయాలనీ, పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెంచినందుకా ? గ్యాస్‌ ‌ధరలు పెంచినందుకా అసలు బీజేపీ చేసిన ఒక్క పని ఏమిటో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తు ఉద్యోగులను అభద్రతా భావంలోనికి నెట్టివేస్తున్నదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వాణీదేవికి వోటు వేయాలనీ, 2 లక్షల వోట్లు టీఆర్‌ఎస్‌కు చెందినవే ఉన్నాయనీ, ముఖ్యంగా మహిళా వోటర్లంతా వాణీదేవి వైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్‌ ‌పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదనీ, వాళ్లు వాళ్లు కొట్టుకోవడం తప్ప ప్రజల వద్దకు వెళ్లి వోట్లు అడిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పనితీరుపై ప్రజల్లో అయిష్టత ఉందనీ, వాణీదేవి గెలుపు ఖాయమని ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply