- శాంతిభద్రతల సమస్యలు రాకుండా పటిష్టమైన బందోబస్తు: సిపి
- గోవధను తీవ్రంగా ఖండించిన మంత్రి హరీష్రావు
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బైపాస్ రోడ్డు సిరిసిల్ల రోడ్డులో గోవధకు పాల్పడిన 8 మంది నిందుతులను సంఘటన జరిగిన 6గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండుకు పంపినట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. సిపి జోయల్ కథనం ప్రకారం.. ఈ నెల 26నసాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో సిద్ధిపేట శివారు సిరిసిల్ల వెళ్లే బైపాస్ రోడ్లో ఇటుక బట్టీల వెనుక ఉన్న రేకుల షెడ్లులో గోవధ చేసినారని విశ్వసనీయ సమాచారం వొచ్చిన వెంటనే పోలీస్ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గోవధ చేసిన ఆవులను పరిశీలించి, షెడ్డులో కట్టి వేసిన ఆవులను గోశాలకు పంపించడం జరిగిందన్నారు. గోవధ చేసిన ఆవుల గురించి వెటర్నరీ డాక్టర్ ద్వారా పోస్టుమార్టం చేయించడం జరిగింది.
గోవధకు పాల్పడిన సిద్ధిపేటలోని నసిర్నగర్కు చెందిన మహ్మద్ జుబేర్(45), సాజిద్పురకు చెందిన మహ్మద్ ఖాజా (35), మహ్మద్ సద్దాం (30 ), మహ్మద్ అరఫత్(24), మహ్మద్ రహిం (32), మహ్మద్ హర్షద్ (25), మహ్మద్ అష్రాఫ్ (30), మహ్మద్ జావిద్ (30 ) తదితర నిందుతులను పట్టుకుని అరెస్టు చేసి శనివారం సిద్ధిపేటలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా..నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించినట్లు సిపి తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ..గోవధకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
సిద్దిపేట జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు జిల్లాలో ఎవరో కొంతమంది చెప్పే పుకార్లు నమ్మొద్దనీ, నిందితులను పట్టుకుని రిమాండుకు తరలించామన్నారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కడ ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.
హేయమైన చర్య : గోవధను తీవ్రంగా ఖండించిన మంత్రి హరీష్రావు…
గోవధ హేయమైన చర్య అని మంత్రి తన్నీరు హరీష్రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేస్తూ…గోవధకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను ఆదేశించిచారు. సిద్ధిపేట శివారులో గోవధలో చనిపోగా మిగిలిన గోవులను సంరక్షణ కొరకు గోశాలకి తరలించాలని అధికారులను మంత్రి హరీష్రావు ఆదేశించారు. సిద్దిపేట బై పాస్ రోడ్డు ప్రాంతంలో గోవధ సంఘటనపై మంత్రి హరీష్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గోవధ హేయమైన చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై వెంటనే విచారణ చేపట్టి ఇందుకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, గోవులను తరలించిన వాహనాలను సీజ్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. చనిపోగా మిగిలిన గోవులను సంరక్షణ కొరకు సిద్దిపేటలోని గోశాలకు తరలించాలనీ, గోవులను రక్షణ కల్పించాలని అధికారులను మంత్రి హరీష్రావు ఆదేశించిన వెనువెంటనే సంబంధిత పోలీస్ అధికారంలోకి రంగంలోకి గోవధకు పాల్పడిన 8 మంది నిందుతులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. మంత్రి హరీష్రావు ఆదేశాలతో 6 గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడం, రిమాండుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.