ఎత్తుకున్నది కాషాయ జెండా…చెప్పుకునేది ఎర్రజెండా
ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్న మంత్రి హరీష్ రావు
ఈటల ఎత్తుకున్నది కాషాయ జెండా ..మాట్లాడుతున్నది ఎర్ర జెండా మాటలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. లెప్టిస్టునని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆత్మ వంచన చేసుకున్నడని, అతనికి ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కాషాయ జెండా పట్టుకుని ఎర్ర జెండా మాటలు మాట్లాడే ఈటల రాజేందర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే రకమని అన్నారు ఎద్దేవా చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి ఈటలకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు పిలుపు నిచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక వ్యక్తి కాదని, ఆయన శక్తి అని అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌లో పొలవేణి పోచమల్లు యాదవ్‌తో పాటు ఆయన మద్దతుదారులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హరీశ్‌రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
ఈటల తాను మాజీ నక్సలైటును అంటడు. కానీ మాజీ నక్సలైట్లపై అనేక కేసులు పెట్టిస్తడని అన్నారు. అందుకు పొలవేణి పోచమల్లు యాదవ్ ఒక నిదర్శనమన్నారు. ఇతనిపై 108 అక్రమ కేసులు పెట్టించాడని పాపం పోచమల్లు ఆవేదన చెందుతున్నడు. ఇతను ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇతనికి మేమంతా అండగా ఉంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మొదటి సారి టీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యాడని, రెండో సారి అధ్యక్షుడు అయిన బాల్క సుమన్ ఐదేళ్లు ఎంపీగా చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచాడని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాడని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ప్రజలు రాజకీయంగా చాలా శక్తిమంతులని, వారికి చాలా విచక్షణ ఉంటుందని అన్నారు. హుజూరాబాద్ గడ్డ టీఆర్‌ఎస్ అడ్డ అని స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో మొదటి సారి బీసీ బిడ్డకు టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిందని అన్నారు. ఈటల రాజేందర్ కేవలం పావలా మందమే బీసీ అన్నారు. ఆయన ఏనాడు తాను బీసీ బిడ్డనని చెప్పుకోలేదని అన్నారు. టీఆర్‌ఎస్ నుంచి బయటకు రాగానే తాను బీసీ బిడ్డనని చెప్పుకుంటే ఎవరు నమ్మలేదని మంత్రి గంగుల తెలిపారు. పోచమల్లు యాదవ్ చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సతీష్‌కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.