Take a fresh look at your lifestyle.

బీజేపీ దుష్ప్రచారానికి లోను కాకుండా.. వాణీదేవిని గెలిపించండి మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : బీజేపీ దుష్ప్రచారానికి లోనుకాకుండా హైదరాబాద్‌,‌ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ‌పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందో గమనించాలని సూచించారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర ఎడ్యుకేషన్‌, అం‌డ్‌ ‌వెల్ఫేర్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌నాగేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఈడబ్ల్యుఐడిసి, సర్వశిక్షా అభియాన్‌ ‌సిబ్బంది సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ప్రజలు కట్టే పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉండగా, అందులో తెలంగాణలో రావాల్సిన 2.43 వాటాను 2.13కి తగ్గించారనీ, 3వ ఫైనాన్స్ ‌కింద హక్కుగా ఇవ్వాల్సిన రూ.1140 కోట్లు కూడా ఇవ్వని విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జీడీపీ పెంచుతామంటూ బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌, ‌డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరలు తగ్గించిందనీ, మొన్నటి బడ్జెట్‌లో ఎరువుల రాయితీ రూ.లక్ష కోట్లు తగ్గించిందనీ, దీంతో ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ‌వీపీని గౌరవించాలన్న ఉద్దేశంతో ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని చెప్పారు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఉందో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో మీరే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తాగునీరు, విద్య, వైద్యం వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టు విద్యుత్‌ ఇలా ఏరంగం తీసుకున్నా తెలంగాణ దేశానికి రోల్‌ ‌మోడల్‌గా నిలచింది.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పల్లా రాజేశ్వరరరెడ్డి, వాణీదేవికి సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతు తెలిపారు. ఈమేరకు ఆ సంఘాల నేతలు మంత్రి హరీష్‌రావును కలసి తీర్మానం ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్‌ ‌విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని సీఎం కేసీఆర్‌ ‌పునరుద్ధరిస్తారన్న విశ్వాసం తమకుందిన పేర్కొన్నారు. దీనిపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు సీపీఎస్‌ ‌రద్దు కోరుతూ ఉద్యమిస్తారని చెప్పారు.

Leave a Reply