Take a fresh look at your lifestyle.

‘‌నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం’ మంత్రి హరీష్‌రావు

  • నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్‌ ‌మాట జవదాటను
  • ఈటల రాజేందర్‌ ‌వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, జూన్‌ 5 (‌ప్రజాతంత్ర బ్యూరో): మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌తనపై చేసిన వ్యాఖ్యలపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు..ఖండించారు. ఈ మేరకు మంత్రి హరీష్‌రావు శనివారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ…నా భుజాల మీద తుపాకీ పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాననీ అన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో పార్టీలో నేను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను.

పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్‌ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కార్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్‌ ‌పార్టీ అధ్యక్షుడే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను. గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా అనేక వేదికలపై చెప్పాను.

ఇప్పుడు మరోసారి చెప్తున్నా. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటాను. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్‌ ‌వైఖరి. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడినా టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. తన సమస్యలకు, తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్‌ ‌భావదారిద్య్రానికి, విజ్ఞత, విచక్షణలేమికి నిదర్శనం అని మంత్రి హరీష్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply