- ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి
- రిపోర్టర్ కుటుంబానికి భరోసానిచ్చిన మంత్రి హరీష్‌రావు
- మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపిన టియూడబ్ల్యూజే
సిద్ధిపేట, జూలై 29 (ప్రజాతంత్ర బ్యూరో): అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన సిద్ధిపేట భారత్ టుడే రిపోర్టర్ నగేష్(గోల్డెన్) కుటుం• సభ్యులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం పరామర్శించారు. సిద్ధిపేటలోని నగేష్ స్వగృహంలో నగేష్ తండ్రి సిద్దయ్య, తల్లిని, నగేష్ భార్యను ఓదార్చారు. నగేష్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరు దుఃఖ పడొద్దంటూ..వారిని ఓదార్చారు. నగేష్ కుటుంబ సభ్యులకు మంత్రి వ్యక్తిగతంగా 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మీడియా అకాడమీ ద్వారా 2 లక్షల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. నగేష్ భార్యకు పెన్షన్ ఏర్పాటు చేయడంతో పాటు ఏదైనా ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. నగేష్ కుమారుడిని 5 వతరగతిలో రెషిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి మంచి చదువు చెప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలనీ, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. మంత్రితో పాటు టియూడబ్ల్యూజే(ఐజేయూ) సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పెద్ది సుభాష్, యూనియన్ నాయకులు నెల్లుట్ల రమణారావు, మజ్జు, సిద్ధిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, మునిసిపల్ మాజీ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, వార్డు నాయకులు సుమన్, పవన్, సూరి తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన టియూడబ్ల్యూజే..
రిపోర్టర్ నగేష్ కుటుంబాన్ని పరామర్శించి అతని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంత్రి హరీష్‌రావుకు టియూడబ్ల్యూజే(ఐజేయూ) సిద్ధిపేట జిల్లా శాఖ తరపున అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో ఇటీవల మరణించిన భారత్ టుడే రిపోర్టర్ నగేష్ కుటుంబ పరిస్థితిని వివరించిన వెంటనే స్పందించి తానే స్వయంగా వచ్చి కుటుంబాన్ని పరామర్శిస్తాననీ చెప్పినట్లుగానే కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఓదార్చి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పిన మాట ప్రకారం నగేష్ ఇంటికి వచ్చి పరామర్శించి ఆర్థిక సహాయం అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మీడియా అకాడమీ ద్వారా 2 లక్షల రూపాయలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని, నగేష్ భార్యకు ఏదయినా ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకుంటాననీ, నగేష్ కుమారుడిని ఉన్నత చదువులు చదివించడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి హరీష్‌రావు భరోసా ఇవ్వడం పట్ల హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తున్న మంత్రి హరీష్‌రావుకు టియూడబ్ల్యూజే యూనియన్ పక్షాన రంగాచారి ధన్యవాదాలు తెలిపారు.