నోముల మృతిపట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. నోముల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నోముల నిలిచిపోతారని చెప్పారు. నోముల మరణం టీఆర్ఎస్ పార్టీకి, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటన్నారు.
మంత్రి హరీష్‌రావు సంతాపం
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం దురదృష్టకరమనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం హైదర్‌గూడలోని అపోల హాస్పిటల్‌కి వెళ్లి నర్సింహాయ్య పార్థివదేహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ… నర్సింహాయ్య జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారనీ, తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్య అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని హరీష్‌రావు ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మంత్రి హరీష్‌రావు వెంట మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఎంపి కేపీఆర్ కూడా నోముల పార్థివదేహానికి నివాళులర్పించారు.
నోముల మృతి టిఆర్ఎస్కు తీరని లోటు : మంత్రి కెటిఆర్
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. కొత్తపేట మార్గదర్శి కాలనీలోని నోముల నివాసానికి వెళ్లి నరసింహయ్య పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పి నోముల కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంపట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్పనాయకులన్నారు. నోముల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టియూడబ్య్లూజే(ఐజేయూ) సంతాపం..
కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడు, నాగార్జునసాగర్ శాసన సభ్యుడు, పేద, కార్మిక వర్గాల పక్షపాతి నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూజే) పక్షానా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్ అలీ ఒక సంయుక్త పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో సిపిఎం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన నర్సింహయ్య ఎన్నో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారనీ ఆయన మృతి పేద వర్గాలకు తీరని లోటుగా భావిస్తున్నామనీ శేఖర్, విరాహత్ అలీ అన్నారు.