- స్వచ్ఛ ఉద్యమంలో ప్రతి పౌరుడూ భాగస్వామ్యం కావాలి
- సిద్ధిపేట ప్రజలకు మంత్రి హరీష్‌రావు పిలుపు
- డోర్ టూ డోర్ చెత్త వాహనాలు ప్రారంభించిన మంత్రి
సిద్ధిపేట స్వచ్ఛ ఉద్యమంలో ప్రతి పౌరుడూ నడిచి వొచ్చి భాగస్వామ్యం కావాలని సిద్ధిపేట ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట మునిసిపాలిటీ పరిధిలోని విలీన వార్డులతో పాటు కొత్త వార్డు ప్రజలందరి సౌలభ్యం కోసం ఇంటింటా చెత్త సేకరణకై వాహనాలను తెప్పించినట్లు మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మునిసిపాలిటీ కార్యాలయంలో గురువారం ఇంటింటా చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఇంటికి చెత్త వాహనం వెళ్లి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగాలనే ఉద్దేశ్యంతో రూ.63 లక్షల వ్యయంతో 6 డోర్ టూ డోర్ చెత్త వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..ప్రజల్లారా సిద్ధిపేట స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యం కండి. సిద్ధిపేట స్వచ్చ ఉద్యమంలో మీ పాత్ర కీలకం, స్వచ్ఛ-శుద్ధిపేటకై ప్రతి ఒక్క పౌరుడు కదిలిరావాలన్నారు. సిద్ధిపేట మునిసిపాలిటీ అంటే మునిసిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది వాళ్లదే కాదు ప్రజలుగా మీపై కూడా మునిసిపాలిటీ పట్ల పెద్ద గురుతర బాధ్యత ఉందన్నారు.
ప్రజలు బాధ్యతను గుర్తించి స్వచ్చ సిద్ధిపేట కోసం నడుం బిగించాలన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో సిద్ధిపేటను స్వచ్ఛశుద్ధిపేటగా సాధిద్దామనీ, ఇంటింటి చెత్త సేకరణకై మరింత మెరుగు కోసమే తన తాపత్రయమని అన్నారు. పట్టణంలో పెరిగిన వార్డులు, పెరిగిన జనాభా దృష్ట్యా ఇప్పటికే ఉన్న చెత్త సేకరణ వాహనాలకు తోడుగా మరో ఆరు వాహనాలు ఏర్పాట్లు చేసి ఇవాళ ప్రారంభించుకున్నామని, మరో మూడు వాహనాల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్ రమణాచారిని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. అన్ని వార్డుల్లో నుంచి ప్రతి ఇంటికి చెత్త సేకరణ వాహనం వెళ్లి ప్రజలకు చేరాలన్నదే తమ లక్ష్యమనీ, ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమేనని, తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరుగా చేసి మునిసిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందివ్వాలని అన్నారు.
పట్టణంలో పెరుగుతున్న జనాభా, పెరిగిన వార్డులకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాల సంఖ్య పెంచడం జరిగిందని, ఇక ప్రతి ఇంటికి చెత్త వాహనం వొస్తుందన్నారు. సిద్దిపేటలోని స్వచ్చ బడిని సద్వినియోగం చేసుకుందామనీ, ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను ఎలా ఎరువుగా మార్చాలో స్వచ్ఛ బడిలో వివరిస్తారన్నారు. పట్టణంలోని ప్రతి ఒక్క పౌరుడు స్వచ్ఛబడిని సందర్శించాలనీ, ఇంటిల్లి పాది వెళ్లి స్వచ్ఛబడి చూసి రావాలన్నారు. వార్డుల వారీగా, బ్యాచ్‌ల వారీగా స్వచ్ఛబడికి వెళ్లాలని, ఇందుకోసం మునిసిపల్ ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. సిద్ధిపేట స్వచ్ఛ ఉద్యమంలో ప్రతి పౌరుడు నడిచివొచ్చి భాగస్వామ్యం కావాలని సిద్ధిపేట ప్రజలకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్సన్ కడవేర్గు మంజుల-రాజనర్సు, వైస్ ఛైర్మన్ కనకరాజు, కమిషనర్ రమణాచారి, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.