Take a fresh look at your lifestyle.

ఏమన్నా పడ్తల్‌ ‌పడుతుందా..

  • రజకుడి ఆర్థిక పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు ఆరా..
  • ఫ్రీ కరెంటుతో బొగ్గుకు వెచ్చించే డబ్బులు తప్పినయ్‌
  • ‌సిఎం కేసీఆర్‌తో లాండ్రీ గిరాకీ మంచిగైందంటూ మంత్రితో సంబురాన్ని పంచుకున్న రజకుడు
  • ఉచిత విద్యుత్‌ ‌స్కీం వరం..అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • సిద్ధిపేటలో ఆకస్మికంగా లాండ్రీషాపును తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, సెప్టెంబర్‌ 2 (‌ప్రజాతంత్ర బ్యూరో) : రజకుల లాండ్రీ షాపులు, దోబీ ఘాట్స్, ‌నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందించే స్కీమ్‌ ‌వరం లాంటిదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట భారత్‌నగర్‌లో గురువారం పార్టీ జెండా పండుగ ఆవిష్కరణ సందర్భంగా అక్కడే ఉన్న మల్లయ్య ఇస్త్రీ షాపును ఆకస్మికంగా సందర్శించిన మంత్రి ఆత్మీయంగా వారితో కాస్సేపు ముచ్చటించారు. ఏం మల్లన్నా.. నీ ఇస్త్రీ గిరాకీ ఎట్లున్నది. ఏమన్న పడ్తల్‌ ‌పడుతుదా.. లేదా.. అంటూ మల్లయ్యను వారి కొడుకు మహేష్‌ను మంత్రి పలకరించి ఆర్థిక పరిస్థితులను, యోగక్షేమాలను మంత్రి హరీష్‌రావు ఆరా తీశారు. మంత్రి ఆప్యాయత పలకరింపుకు బదులుగా… సిఎం సార్‌, ‌మీ పుణ్యమా అని.. ఇప్పుడు జర సబురంగా ఉన్నాం సార్‌ అం‌టూ.. అప్పట్లో వచ్చిన పైసలన్నీ బొగ్గుల పెట్టెకు 1200 నుంచి 1300 రూపాయల వరకూ పెట్టే వాళ్లం. బొగ్గుల పెట్టే గరం అయ్యేందుకు అరగంట పట్టేది. ఎప్పుడన్న వానొస్తే బొగ్గులు సల్లబడి ఇస్త్రీపెట్టేకు ఇబ్బందయ్యేది.

ఇయ్యాల మా దోబీలకు 250 యూనిట్ల కరంటు ఫ్రీగా ఇయ్యటంతో జర మాకు బొగ్గుల పెట్టే తిప్పలు తప్పినయ్‌.. ‌సమయం వృథా కాకుండా.. 24 గంటల కరెంటుతో కటుక(స్విచ్ఛ్)‌వేయగానే పెట్టే గరమై బట్టలు ఇస్త్రీ చేసుకునే సౌలత్‌ ‌వచ్చింది.. సారూ.. అంటూ సంబురంగా మంత్రికి చెప్పుకున్నారు. ఇప్పటికీ ఎన్ని యూనిట్లు కరెంటు కాలిందని ఆరా తీయగా.. వారం రోజులైంది సారూ.. 48 యూనిట్లు కాలింది. ఇంకా 202 యూనిట్ల కరెంటు వాడుకోవచ్చనని మంత్రికి మల్లయ్య కొడుకు మహేష్‌ ‌తెలిపాడు. 250 యూనిట్లు సరిపోకపోతే సిఎం కేసీఆర్‌తో మాట్లాడి అదనంగా పెంచే యోచన చేస్తానని మంత్రి భరోసానిచ్చారు. తరతరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీబ్రాహ్మణ కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ఉచిత విద్యుత్‌ ‌నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్థిక వెసులుబాటు కూడా కలిగిందని మంత్రి చెప్పారు.

ఉచిత విద్యుత్‌ ‌కోసమై దోబీ, లాండ్రీలకై జిల్లా వ్యాప్తంగా 280 మంది రజకులు లబ్ధి పొందుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తున్న దరిమిలా కరెంట్‌ ‌కట్‌ ‌చేయవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వివరించారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించి నాయీబ్రాహ్మణులు, రజకుల సౌకర్యార్థం మునిసిపల్‌ ‌లైసెన్స్, ‌ట్రేడ్‌ ‌లైసెన్స్ ‌నిబంధనను మినహాయించిందని తెలిపారు. షాప్‌తో పాటు ఇంటి వద్ద పని చేసే రజకులు, నాయీబ్రాహ్మణులకు కూడా ఈ స్కీం వర్తింప చేసిందని మంత్రి పేర్కొన్నారు. రజకుల లాండ్రీ షాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందించే స్కీం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు సహకారంతో జిల్లాలో బిసి సంక్షేమ శాఖ అధికారులు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టాలని మంత్రి సూచించారు. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు తమ వివరాలను మీసేవా కేంద్రాల్లో వెంటనే నమోదు చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. మంత్రి వెంట స్థానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు.

Leave a Reply