- ఇటిక్యాలలో పొలంలోకి దిగి వరి విత్తనాలను వెదజల్లిన హరీష్
- వెదజల్లే పద్దతిలో రైతన్నకు అధిక లాభాలు: మంత్రి హరీష్‌రావు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు రైతు అవతారం ఎత్తారు. తలకు పాగా చుట్టుకుని తానే స్వయంగా పొలంలోకి దిగి వరి విత్తనాలు వెదజల్లారు. రైతులకు అవగాహన కల్పించారు. వరి పంటను వెదజల్లే పద్దతితో పండిస్తే అధిక లాభాలొస్తాయనీ మంత్రి హరీష్‌రావు రైతులకు సూచించారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ఇటిక్యాలలో పొలంలోకి స్వయంగా దిగి వరి విత్తనాలు వెదజల్లిన అనంతరం పొలం వద్ద రైతులనుద్దేశించి మాట్లాడుతూ…వెదజల్లే పద్దతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వొచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవొచ్చని అన్నారు. నారు పోసే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవొచ్చునన్నారు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్ని రోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, సిద్ధిపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
వెదజల్లే పద్దతిలో వరి సాగు చేసే అంశంపై సిద్దిపేట జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను హరీష్ రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాక్రిష్ణశర్మ, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గుండా రంగారెడ్డి, ఎంపిపి బాలేషంగౌడ్, జడ్పిటిసి వంటేరు సుధాకర్‌రెడ్డి, ఏఎంసి ఛైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ బట్టు సుధాకర్‌రెడ్డి, కొండపోచమ్మ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజేందర్‌రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంటు పనుగట్ల శ్రీనివాస్‌గౌడ్, స్థానిక సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.