- జాతీయస్థాయి సైక్లింగ్ క్రీడలను రంగనాయకసాగర్ బండ్‌పై నిర్వహిస్తాం
- రోడ్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు
రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి సైక్లింగ్ క్రీడలను రంగనాయకసాగర్ జలాశయం బండ్‌పై నిర్వహించేందుకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాననీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. సోమవారం సిద్ధిపేట జిల్లా రంగనాయకసాగర్ రిజర్వాయర్‌పై సిద్దిపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ , సిద్ధిపేట స్పోర్టస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 5వ రాష్ట్రస్థాయి సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ… ఆరోగ్యమే మహాభాగ్యమనీ, విద్యతో పాటు క్రీడలకు తల్లిదండ్రులు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
జీవితంలో ఒడి దొడుకులను తట్టుకునే శక్తి క్రీడల వల్ల చిన్నారులకు లభిస్తుందనీ, రాష్ట్రం, దేశంతో పాటు ప్రపంచంలో సైక్లింగ్ కు ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ లభిస్తుందనీ, సైక్లింగ్ క్రీడాకారులకు అన్నీ విధాలుగా అండగా ఉంటామనీ, సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ సైక్లింగ్ క్రీడాకారులకు కావాల్సిన ఏక్విప్మెంట్లు అందిస్తామన్నారు. క్రీడా హబ్‌కు సిద్దిపేటను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామన్నారు. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు చుట్టూ రెండు కిలమీటర్ల మేర సింథటిక్ సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.
ఈ పోటీలో అండర్ 14, 16, 18, 23, మెన్ అండ్ ఉమెన్, మాస్టర్ ఈవెంట్స్ కేటగిరీలలో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 260 మంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి సైక్లిస్ట్‌లు పాల్గొన్నారు. సిద్ధిపేట ఏఎంసి ఛైర్మన్ పాల సాయిరాం, చిన్నకోడూరు ఏఎంసి ఛైర్మన్ కాముని శ్రీనివాస్, చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్‌రెడ్డి, చంద్లాపూర్ సర్పంచి సూరగోని చంద్రకళ రవిగౌడ్ తదితరులు పాల్గొనగా వ్యాఖ్యాతగా పిఆర్టియూ రాష్ట్ర నాయకురాలు లక్కిరెడ్డి విజయా శుభాకర్‌రెడ్డి వ్యవహరించారు.