- ప్రజాదరణ పొందేలా వైద్యులు సేవలందించాలి
- యునానీ వైద్యంతో అద్భుతమైన ఫలితాలు
- సిద్ధిపేటలో ఆయూష్ ఉచిత యునాని మెగా వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట, ఫిబ్రవరి 14(ప్రజాతంత్ర బ్యూరో) : యునానీ వైద్యంతో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయనీ, దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చనీ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఎన్జీవో భవన్‌లో సోమవారం ఆయూష్ ఆధ్వర్యంలో ఉచిత యునాని మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రజల్లో చైతన్యం కల్పించి, నమ్మకం, విశ్వాసాన్ని కలిగించి ప్రజా ఆదరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలా పొందేలా ఆయూష్, యునాని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారుల మంత్రి హితవు పలికారు. యునానీ మందులు ప్రకృతి నుంచి తయారు చేసినవనీ, ఆయూష్ విభాగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, కొరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 11న జాతీయ యునాని దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయూష్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యునాని వైద్యం ఒకప్పుడు ప్రముఖంగా ఉండేదని, కొత్త ఆధునిక వైద్య సదుపాయాలు రావడంతో కొద్దిగా వెనుక ఉన్నట్లు చూస్తామని, చార్మినార్ యునాని దవాఖానకు పక్క రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి తమ దీర్ఘకాలిక రోగం నయం చేసుకుని వెళ్తారని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులకు, శారీరక, మానసిక వ్యాధులకు, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ, షుగర్, పక్షవాతం, ఎలర్జీ, ఆస్తమా తదితర వ్యాధులకు ఎలాంటి సైడ్‌ఎఫెక్టస్ లేకుండా వైద్యం ఒక యునానీలోనే అందుబాటులో ఉన్నదని, అనుభవజ్ఞులైన యునాని వైద్యులు ఉచితంగా చికిత్స చేసి మందులు అందిస్తున్నట్లు వివరించారు. యునాని గ్రీకు దేశంలో పుట్టి, నిజాం పరిపాలనతో ప్రాచుర్యంలోకి వొచ్చి 4,5 రకాలుగా ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు, వాటిలో హోమియోపతి, నాచురోపతి, అల్లోపతి, ఆయుర్వేద, యునాని ద్వారా సేవలు రాష్ట్రంలో హోమియో, ఆయుర్వేద, యునాని, నాచురోపతిలో మెడికల్ కళాశాలలు నడుపుతున్నట్లు వివరిస్తూ.. రేపటి తరాలకు ఆయూష్ వైద్య సేవలు ఉండేలా..బలోపేతం దిశగా సిఎం కేసీఆర్ నిర్ణయించి కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయూష్ విభాగం కింద హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు ఉన్నాయని, వీటి అభివృద్ధికై ఒక్కో వెల్‌నెస్ సెంటరుకు రూ.6 లక్షల 80 వేల రూపాయల చొప్పున రూ.29 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. హెల్త్ వెల్‌నెస్ కేంద్రాలు ప్రజలకు ఉపయోగపడేలా విరివిగా వినియోగంలో తేవాలని కోరారు. యునాని ఆయూష్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణం, తొగుట, మిరుదొడ్డిలో సెంటర్లు ఉన్నాయని, సిద్దిపేట జిల్లాలో 30 వరకూ యునాని హాస్పిటళ్లు ఉన్నాయని, వాటిలో ఒపి పెరిగేలా సమయపాలన పాటించాలని ఆయూష్ వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయూష్ కమిషనర్ అలుగు వర్షిణి, ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ రవి నాయక్, క్యాంపు ఇంచార్జి డాక్టర్ ఝాన్సీ, ఆర్గనైజర్ అనుదీప్, మునిసిపల్ వైస్ ఛై•ర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్ తాడూరి సాయిఈశ్వర్‌గౌడ్, కమిషనర్ రవీందర్‌రెడ్డి, డిఎంహెచ్‌వో మనోహర్ ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అదనంగా పార్థివ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి…
నిరుపేద బంధువులు ఎవరైనా ప్రభుత్వ దవాఖానల్లో చనిపోతే మృతదేహాలను వారి స్వస్థలాలకు చేరాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ప్రభుత్వం గుర్తించి పార్థివ వాహనాలు అందుబాటులో తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జిల్లాకు అదనంగా మంజూరైన కొత్త పార్థివ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ దవాఖానకు వొచ్చే వారిలో అత్యధికులు పేదలేనని, చికిత్సకోసం వొచ్చిన పేద రోగులు దురదృష్టవశాత్తూ చనిపోతే ఆ మృతదేహాన్ని సొంతూరుకు తీసుకువెళ్లడానికి ఆ పేద కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో తెలియందికాదు. ఈ క్రమంలోనే చనిపోయన వ్యక్తి భౌతికకాయం గౌరవప్రదంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పార్థివవాహన సేవలు ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్రంలో వివిధ దవాఖానల్లో 50 వాహనాలను ఏర్పాటుచేసి రోజుకు 30కిపైగా పార్థివ దేహాలను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపారు. శవాన్ని వారి స్వస్థలాకు ఉచితంగా చేరేలా ఏర్పాట్లు చేసి, వీటి నిర్వహణ 108 ఉచిత అంబులెన్స్ నిర్వహించే జివికే-ఈఎంఆర్‌ఐ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా వైద్య శాఖ నోడల్ అధికారి డాక్టర్ కాశీనాథ్, వాహన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.