Take a fresh look at your lifestyle.

గెల్లుకు ఎమ్మెల్యే కళ వొచ్చింది..!

  • 25 వేల మెజారిటీతో గెలవ బోతున్నడు
  • మంత్రి హరీష్‌ ‌రావు ధీమా
  • ఆలోచించి వోటేయాలని ప్రజలకు పిలుపు

‘‘ఐదు నెలల నుండి ప్రచారం జరుగుతుంది. ఈరోజు ప్రచారం చివరి రోజు. రాత్రి ఏడూ గంటల నుండి మైకుల చప్పుడు ఉండదు. కోలాటం అక్కాచెల్లెళ్ల ప్రచారం చేస్తూ ఎండలో తిరిగారు. గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌కు ఎమ్మెల్యే కళ వొచ్చింది. సిఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్‌ 25 ‌వేల మెజారిటీతో గెలవబోతున్నారు’’ అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌తో కలిసి మంత్రి హరీష్‌ ‌రావు బుధవారం జమ్మికుంట మండలం, బిజిగిరి షరీఫ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు…‘‘ ఈ రోజు ప్రచారం చివరి రోజు..అందరి మాటలు విన్నారు. ఎవరు ప్రజలకు సహాయం చేస్తారు. ఎవరి వల్ల పనులు జరుగుతాయన్నది అలోచించి వోటు వేయాలి. అందరు చెప్పింది వినాలి. కానీ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. తిన్న రేవు తలవాలి అన్నారు పెద్దలు. ఆలా తెలిస్తేనే… నీయతి, బర్కత్‌ ఉం‌టది ..! 2016 రూ. పింఛన్‌ ఇచ్చింది కారు, కేసీయారు కాదా? ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇస్తున్నది వృద్ధులకు, వికలాంగులకు ఇస్తున్నది కేవలం రూ. 600 పింఛన్‌ ‌మాత్రమే. మొదటిసారి అధికారంలోకి వొచ్చినపుడు రూ. 200 ఉన్న పింఛన్‌ ‌రూ. వెయ్యి చేసాం..మరోసారి 2016 చేసాం.. కల్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు మొదట ఎస్సీలను మాత్రమే అమలు చేసాం..అప్పుడు రూ 50 వేలు మాత్రమే ఇచ్చినం.. కొంచం చేయి తిరిగిన తర్వాత..అందరికి అమలు చేసారు… ప్రస్తుతం రూ. లక్ష 116 రూపాయలు ఇస్తున్నాం. కేసీఆర్‌ ‌కిట్‌ ఇచ్చి సర్కారు దవాఖానలో డెలివరీ చేసి రూ. 12 వేల రూపాయలు ఇచ్చి ఇంటిదగ్గర దింపుతున్నది కేసీఆర్‌ ‌ప్రభుత్వం.

జమ్మికుంటలో డాక్టర్ల మీటింగ్‌ ‌పెడితే..కేసీఆర్‌ ‌కిట్‌ ‌ప్రథకం పెట్టిన తర్వాత మాకు గిరాకీ తగ్గిందని. అందరు సర్కారు దవాఖానలపై వెళ్తున్నారని, గతంలో 15 డెలివరీలు చేసేవాళ్ళం..ఇప్పుడు ఒకటి రెండు కూడా రావడం లేదని ప్రైవేట్‌ ‌డాక్టర్లు చెప్తున్నారు. కేసీఆర్‌ ‌పెట్టిన పథకం మంచి ఫలితం ఇచ్చినప్పుడు నా మనసుకు సంతోషం కలిగింది. 70 ఏళ్ల పాలనలో రైతులకు ఏ ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదు. రైతులతో నీటి తీరువా, భూమి శిస్తు కట్టించారు. కానీ రైతుబంధు ఇస్తూ రైతుకు శిస్తు కడుతున్న ప్రభుత్వం టీఆరెస్‌ ‌ప్రభుత్వం…ఉచిత కరెంటు ఇచ్చింది టీఆరెస్‌ ‌ప్రభుత్వం… ఎండాకాలం యాసంగి పంట వేయాలంటే.. రైతులు నీళ్లు లేక బాధపడేవాళ్లు. మొఖాన్ని మొగులుగు పెట్టి చూసేవాళ్ళు…అనుమానం మీద నారు పోసేవాళ్ళు..పొట్టకు వొచ్చే వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి..షెట్టర్లు పగులగొట్టేవాళ్ళు…కాలువలు తెగ్గొట్టేవాళ్ళు…ఎవరైనా కాలువకు మోటార్లు పెడితే… ఎమ్మార్వో ఆఫీసు వాళ్ళు వొచ్చి పైపులు కోసేవాళ్ళు..మోటార్లు జీపులో వేసుకుపోయేవాళ్లు, ధర్నాలు చేసేవాళ్ళు…ఇప్పుడు ఆ బాధలు ఉన్నాయా? బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం. నీళ్లు ఇక చాలు.. బంద్‌ ‌చేయండి అనే దాకా ఇస్తున్నాం. వెనుకటి ఎవరైనా పెద్దలు చనిపోతే…బొక్కలు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లలో కలిపి సీసాల్లో నీళ్లను తెచ్చుకునేవాళ్ళం..వంద తాటిచెట్ల లోతున ఉన్న కాళేశ్వరం నీళ్లను ఎత్తి పోస్తే..బిజిగిరి షరీఫ్‌ ‌నడి ఊళ్ళో నుండి నీళ్లు పోతున్నాయా? లేదా?..

ఈ ఘనత టీఆరెస్‌దే. కరెంట్‌ ‌గతంలో ఎప్పుడు వొస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు…బావుల గడ్డల మీద, పొలం గట్ల మీద రైతులు పడుకునేవాళ్ళు…కానీ నేడు 24 గంటల కరెంటు ఇచ్చింది టీఆరెస్‌ ‌ప్రభుత్వం. కానీ ఈటల రాజేందర్‌, ‌బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చారు? బొందపెడుతా…కూలగొడుతా.. కాలవెడుతా..అంతు చూస్తా..గోరీ కడుతా అని అన్నాడే తప్ప..నిరుపేదలకు ఏమైనా చేస్తా అని చెప్పాడా? టీఆరెస్‌ ‌వాళ్ళను తిట్టడం తప్ప రాజేందర్‌ ‌చెప్పింది ఏమి లేదు. నీ స్వార్థం కోసం బీజేపీలో చేరావు. బీజేపీ గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర రూ. 1050 చేసింది. వోట్లు అయిపోయిన తర్వాత ఒకేసారి రూ. 200 పెంచుతారట..సబ్సిడీ మాత్రం తగ్గించారు. మేము ప్రతి గ్రామానికి మహిళా భవనానికి రూ. 15 లక్షలు ఇచ్చాము..మహిళా సంఘాలకు రుణాలు చెక్కులు ఇచ్చాము.. రోడ్లకు నిధులు ఇచ్చాము.. మేము పనిచేశాం… మాకు వోట్లు వేయమని అడుగుతున్నాం. ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వొచ్చారు.. సిలిండర్‌ ‌ధర తగ్గించాలని అడిగాం… సబ్సిడీ రూ. 250 ఇవ్వాలని అడిగాం.. ఉత్త చేతులు, గాలి మాటలు తప్ప పేదలకు ఏం చేస్తారో చెప్పలేదు. బీహార్‌ ‌రాష్ట్రానికి చెందిన డోలా కుమారికి ప్రధాని మోడీ ఉజ్వల పథకం కింద గ్యాస్‌ ‌సిలిండర్‌ ఇచ్చారు..గ్యాస్‌ ‌సిండర్‌ 400 ‌నుండి వెయ్యి దాటడంతో ఆమె సిలిండర్‌ అటక ఎక్కించింది..పొయ్యిల కట్టెలు వాడుతుంది. ఏడాది వరకు సిలిండర్‌ ‌రూ. రెండు వేలు దాటుతుంది…ఇందుకు బీజేపీకి వోటు వేద్దామా? ఇక సిలిండర్‌ ‌ధర పెంచం అని చెప్పండని బీజేపీ నాయకులను అడిగాం…అదికూడా వారు చెప్పడం లేదు. 30వ తారీకు రోజు వోటు వేసే ముందు మహిళలు వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ ‌సిలిండర్‌కు దండం పెట్టి కారు గుర్తుకు వోటు వేసి బీజేపీని బొందపెట్టండి. ఆలాగైతేనే గ్యాస్‌ ‌ధర తగ్గుతుంది.

పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు పెంచారు..ఒక ఎకరం దూన్నెందుకు రూ. 2500 అయ్యేది. కానీ నేడు రూ. 6 వేలు అవుతుంది. డీజిల్‌ ‌ధర పెరగడమే దీనికి కారణం. కేసీఆర్‌ ‌రైతుబంధు రైతు కుడి చేతికి ఇస్తుంటే…ఎడమ చేతితో బీజేపీ తీసుకుంటుంది. మంచినూనె 200 అయింది..నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. రాజేందర్‌కు ఏం చెప్పాలో తెలియడం లేదు. అందుకే టీఆరెస్‌ను తిడుతున్నాడు. బీజేపీ కాంగ్రెస్‌ ‌తెలంగాణాలో అధికారం లోకి వొచ్చేది లేదు. రాజేందర్‌ ‌రాక ముందు టీఆరెస్‌ ‌గెలిచింది…రాజేందర్‌ ‌పోయిన తర్వాత కూడా గెలిచేది టీఆరెస్‌ ‌పార్టీనే. గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ను గెలిపించండి..ఇంటి అడుగు జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల 4 వేలు మంజూరు చేస్తాం. రాజేందర్‌ ‌మంత్రిగా ఉంది ఒక్క ఇంటిని కూడా నిరుపేదల కోసం నిర్మించి ఇవ్వలేక పోయారు. మైనారిటీలకు సిఎం షాదీ ముబారక్‌ ఇస్తున్నారు. సిఎం కేసీఆర్‌ ‌మైనారిటీ విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో గురుకుల పాఠశాలలు పెట్టారు. ఒక్కో విద్యార్ధి పేరు మీద రూ. లక్ష ఏడాదికి ఖర్చు చేస్తున్నారు. వొచ్చే బడ్జెట్లో రైతులకు రూ. లక్ష మాఫీ చేస్తాం…57 ఏళ్లకే పింఛన్‌ ‌కూడా ప్రారంభిస్తాం..దళిత బందును అమలు చేస్తాం. ఇంకా రెండేళ్లు టీఆరెస్‌ ‌ప్రభుత్వమే ఉంటుంది.

దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే వస్తాయా? బీజేపీ ప్రభుత్వం వొచ్చేది లేదు..ఏమి ఇచ్చేది కూడా లేదు..వాళ్ళు జుట మాటలు, తొండి మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గ్యాస్‌లో రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉందని చెప్తున్నారు. రైతులు ఇష్టం వొచ్చిన పంటలు వేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు..ఏదైనా వేసుకోవచ్చు..దీనిపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు..రైతులు పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం. ఎవరో దాడులు చేసినట్టు సృష్టించి సానుభూతి పొందే ప్రయత్నం ఈటల రాజేందర్‌, ‌బీజేపీ చేస్తుంది. వాటిని నమ్మకండి…సోషల్‌ ‌మీడియాలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయాలనీ చూస్తున్నారు బీజేపీ నాయకులు. వీటిని నమ్మొద్దు…హుజురాబాద్‌ ‌ప్రజలు లాభపడాలి. మండలంలో బిజిగిరి షరీఫ్‌లో ఎక్కువ మెజారిటీ గెల్లు శ్రీనివాస్‌కు ఇవ్వాలి. కోటి రూపాయలు అభివృద్ధి పనులకు ఇస్తా. గెల్లు గెలుపు ఖాయమైంది..మెజారిటీనే ఎక్కువ రావాలి..ఇల్లందకుంట రామాలయానికి రూ. 10 కోట్లు, బిజిగిరి షరీఫ్‌కు రూ. కోటి రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం..అని మంత్రి హరీష్‌ ‌రావు హామీ ఇచ్చారు.

Leave a Reply