Take a fresh look at your lifestyle.

రోహిణి కార్తెలోనే వరి నాట్లు..

  • రైతులను సమాయత్తం చేయాలి
  • వెదజల్లే పద్ధతి లో వరి సాగుతో ప్రయోజనాలు అనేకం
  • ఎకరాకు రూ.10 వేల వరకు ఆదా
  • రైతులను ఆదిశగా ప్రోత్సహించాలి
  • వానా కాలం పంట సాగుపై టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట జిల్లా రైతులంతా రోహిణి కార్తెలోనే నాట్లు వేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, వానాకాలం పంట సాగు కార్యాచరణ పై సిద్దిపేట జిల్లా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ••సకాలంలో పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటలు, తదితర అంశాలపై జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. రోహిణి కార్తెలో నాట్లు వేయించేందుకు రైతులను సమాయత్తం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రోహిణి కార్తెలో సాగు వల్ల ముందే పంట చేతికి రావడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుందన్నారు. చీడపీడల బెడద చాలావరకు తగ్గుతుందని మంత్రి తెలిపారు.వడగండ్ల కష్టాలు ఉండవన్నారు.

సంప్రదాయ పంటల సాగు తో రైతులు ఆర్థికంగా నష్టపోతున్న దృష్ట్యా…
పంట సాగు విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను చైతన్యం చేయాలన్నారు. మార్కెట్‌ ‌లో బాగా డిమాండ్‌ ఉన్న పంటలను గుర్తించి ఆ పంటలను సాగు చేసేలా బాధ్యత మనందరి అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టుకోవాల న్నారు. రానున్న రోజుల్లో ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న స్టాకును పాత రేట్లకే మేలా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసేలా చైతన్యం చేయాలి
వరిలో నాట్లు వేయకుండా వెదజల్లే పద్ధతి సత్ఫలితాలనిస్తోందన్నారు. నాటు వేసేందుకు కూలీల దొరక క పోవడం, దొరికినా వీళ్లకు అధిక మొత్తం వెచ్చిం చాల్సీ రావడం, సకాలంలో నాట్లు పడకపోవడం తో దిగుబడిపై ప్రభావం పడుతుందని మంత్రి తెలిపారు. వీటికి విరుగుడుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో వెదజల్లే పద్ధతి మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఈ పద్ధతిన సాగు చేసే రైతులకు ఎకరాకు కనీసం పది వేల రూపాయలు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో రైతులు విధానంలో సాగు చేసేందుకు ముందుకు వచ్చేలా వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత రైతుబంధు సమితి సభ్యులు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు దీనిని మంత్రి స్పష్టం చేశారు.

పప్పు ధాన్యాలు విస్తీర్ణం పెరిగేలా చూడాలి
పప్పుధాన్య పంటలు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు అన్నదాతలకు ఆదాయాన్ని అందిస్తాయ నీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. పప్పుధాన్యాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉం‌దన్నారు. పప్పు ధాన్యాలతో ఎంతో ప్రయోజనం ఉన్నా వాటి సాగు విస్తీర్ణం మాత్రం సిద్దిపేట జిల్లాలో ఆశించిన మేర లేదన్నారు. వచ్చే వానాకాలంలో కంది మినుము, శనగ, పెసర్లు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగేలా చూడాలన్నారు. ఇందుకోసం జిల్లాలోని రైతులకు అవగాహన కార్యక్రమాలను వ్యవసాయ శాఖ నిర్వహించాలన్నారు. అలాగే జిల్లాలో పచ్చి రొట్టె ఎరువుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి యొక్క సారాన్ని పెంచే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లాకు వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్‌ అన్‌లోడింగ్‌ ‌వేగంగా చేయాలన్నారు. ట్యాబ్‌ ఎం‌ట్రీ సత్వరమే జాప్యం లేకుండా జరిగేలా చేసి, చెల్లింపులు వేగంగా చేయడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌ ‌కుమార్‌ ‌జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యలు, వర్ష సూచన నేపథ్యంలో తీసుకున్న అప్రమత్తత చర్యలు ,వానకాలం పంట కార్యచరణను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు టెలీ కాన్ఫరెన్స్‌లో వివరించారు. ఈ సందర్భంగాయాసంగి ధాన్యం కొనుగోలు సాఫీగా చేసేందుకు పార్లమెంట్‌ ‌సభ్యులు, శాసనసభ్యులు చేసిన పలు సూచనలు పాటిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా జరిగేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ ‌తెలిపారు.

Leave a Reply