- నీవా కేసీఆర్ గురించి మాట్లేడేది
- స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా? వద్దా?
- అన్నదాతల నిజమైన అత్మబంధువు సిఎం కేసీఆర్
- ఎంపి సిఎం చౌహాన్‌పై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, జనవరి 8(ప్రజాతంత్ర బ్యూరో) : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిజెపికి చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను దొడ్డిదారిన కొనుక్కుని సిఎం కుర్చీపై కూర్చోన్న చౌహాన్‌కు టిఆర్‌ఎస్ పార్టీ, సిఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ దొడ్డిదారిన సిఎం అయ్యారని మండిపడ్డారు. ఏ రంగంలో కూడా మధ్యప్రదేశ్ తెలంగాణకు పోటీ కాదని స్పష్టం చేశారు. గొప్పగా పాలిస్తే తెలంగాణలో మధ్యప్రదేశ్ కూలీలు ఎందుకుంటారని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో మధ్యప్రదేశ్ ఆదాయం తెలంగాణలో సగం కూడా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఏటీఎంతో పోల్చడం సరికాదని మంత్రి తెలిపారు. ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ చేయొద్దనే 317జీవో రద్దు చేయాలంటున్నారని అన్నారు. ఉద్యోగులకు కేంద్రం 15శాతం ఫిట్‌మెంట్ ఇస్తే…తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందన్నారు. తెలంగాణలో 2.2 శాతం మాత్రమే నిరుద్యోగ రేటు ఉందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
మంత్రి హరీష్‌రావు శనివారం సిద్ధిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ… శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారనీ, చౌహాన్ మాటలు చూస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉందన్నారు. టిఆర్‌ఎస్‌ను సిఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు చౌహాన్‌కు లేదన్నారు. నాలుగేండ్లుగా సిఎంగా చౌహాన్ ఏం సాధించాలో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనీ, మీ కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం సంగతి ఏంటన్నారు. మధ్యప్రదేశ్‌లోనే అతిపెద్ద కుంభకోణం జరగలేదా? ఎవరికైనా శిక్ష పడిందా? అని ప్రశ్నించారు. మనుషులనే మీరు చంపేశారు.
మీ కుంటుబ సభ్యుల మీద, మీ పార్టీ నేతలు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వొచ్చాయన్నారు. 317జీవో రద్దు చేయాలా…అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా? స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా? వద్దా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్‌తో, రాష్ట్రపతి నిబంధనలకులోబడి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 తెచ్చిందన్నారు. స్థానికులకు 95 శాతం ఉద్యోగుల ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో కేంద్రాన్ని కోరితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకులోబడే జీవో317ను ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఉద్యోగుల కేటాయింపు అనంతరం అన్ని జిల్లాలో ఏర్పడే ఖాళీలను అదే జిల్లా నిరుద్యోగులతో నింపుతామన్నారు. ఉద్యోగుల కేటాయింపుల అనంతరం ప్రభుత్వం శాఖలలోని ప్రతి ఖాళీని నింపాలన్నది సిఎం కేసీఆర్ సంకల్పం అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలురావాలని సిఎం కేసీఆర్ భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దని బిజెపి కుట్ర చేస్తుందన్నారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఏఎంసి ఛైర్మన్ పాల సాయిరాం, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.
అన్నదాతల నిజమైన అత్మ బంధువు కేసీఆర్..: సిద్ధిపేట రైతుబంధు వేడుకల్లో మంత్రి హరీష్ రావు
అన్నదాతల నిజమైన ఆత్మ బంధువు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకూ రూ. 50 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ చేయడం జరిగిందనీ, రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్టేననీ అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో జరిగిన రైతుబంధు వేడుకల్లో రైతులతో కలిసి మంత్రి హరీష్‌రావు సంబురాల్లో పాల్గొని మాట్లాడుతూ….సాగునీటి ప్రాజెక్టులతో మెట్ట ప్రాంతం తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందనీ, అసంబద్ధ విమర్శలతో ప్రజల్లో పలచన కావొద్దని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. రైతుల సౌభాగ్యాన్ని కాంక్షించి.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో రైతుబంధు ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని హరీష్ రావు పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమ పథకాలు,కార్యక్రమాలతో సిఎం కేసీఆర్ ఆత్మ బంధువుగా మారాడన్నారు.
గత ఏడు సంవత్సరాలుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతరాయంగా కొనసాగిస్తున్న అద్భుతమైన పథకం రైత బంధు అని అన్నారు. రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని చెప్పారు. రైతుల పట్ల రాష్ట్ర సిఎం కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్ధ అనిర్వచనీయమైనదని కొనియాడారు. ఆరుగాలం కష్టించి శ్రమించే రైతన్నకు అండదండగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ ఎనిమిది విడతలుగా రూ. 50 వేల కోట్ల రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమయ్యాయని మంత్రి తెలిపారు. రైతులకు సాగునీటిని అందించడంతో పాటు ఎదురొచ్చి డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కారేనని మంత్రి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు చేపట్టి ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఏఎంసి ఛైర్మన్ పాల సాయిరాం, మునిసిపల్ ఛైర్‌పర్సన్ కడవేర్గు మంజుల-రాజనర్సు, సూడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.