Take a fresh look at your lifestyle.

కాళేశ్వరంతో ప్రతి ఎకరా సాగులోకి..

  • పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికే డబుల్‌ ఇం‌డ్లు
  • రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో నిర్మాణం
  • ఒక్క చెరువు కూడా తెగలేదంటే అది మిషన్‌ ‌కాకతీయ ఘనతే
  • గుర్రాలగొందిలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు

సమృద్ధిగా వర్షాలు కురవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నిర్మాణం వల్లే జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3484 చెరువులనుగానూ ఇప్పటి వరకూ 3 వేల పైగా చెరువులు నిండు కుండలను తలపిస్తూ మత్తడి దుంకుతున్నాయని మంత్రి తెలిపారు. దశాబ్దాల తర్వాత చెరువులన్నీ నిండడంతో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ రైతులు, మత్స్య కారులు అనందంగా ఉన్నారని మంత్రి తెలిపారు. సోమవారం నారాయణపేట మండలం గుర్రాలగొందిలో జిల్లా ప్రజా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాక్రిష్ణవర్మతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కాళేశ్వరం జలాలు, సమృద్ధిగా వర్షాలతో చెరువులన్నీ దాదాపుగా నిండాయన్నారు. ఇలా అన్ని చెరువులు నిండుతాయని ప్రజలెవరూ కలలో కూడా ఊహించలేదు అని అన్నారు. జిల్లాలో చాలా వరకు చెరువులు నిండిన ఒక్క చెరువు తెగలెదంటే అందుకు కారణం మిషన్‌ ‌కాకతీయ అని అన్నారు. ముందు చూపుతో చెరువులన్నీ బలోపేతం చేసుకోవడం వల్లే ఇది సాధ్యపడిందన్నారు.

గుర్రాలగొంది పెద్దరాయిని చెరువు కూడా నిండి గత 2 నెలలుగా మత్తడి దుంకుతుందన్నారు. పెద్దరాయిని చెరువు కోమటి చెరువును తలపిస్తుందన్నారు. పెద్దరాయిని చెరువును సుందరీకరణ చేస్తామన్నారు. గుర్రాలగొంది గ్రామం ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డ్ ‌దక్కించుకున్నదని… ఇది గ్రామ ప్రజల ఘనతే అన్నారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో పని చేసి మరిన్నీ అవార్డులు చేజిక్కించుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ను సమూలంగా నిర్మూలించేందుకు గుర్రాలగొందిలో స్టీల్‌ ‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. రూ. 3 కోట్ల 50లక్షలతో అదనంగా 5 వేల మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యం గల మరో ఆధునిక వ్యవసాయ గోదాంను నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.12 లక్షలతో లక్ష్మీ నరింహస్వామి దేవాలయం పునరుద్ధరణ చేపడుతున్నామన్నారు. కొత్తగా మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గుర్రాలగొందిలో 36 రెండు పడక గదుల ఇండ్లను లబ్దిదారులకు అందజేశామన్నారు. అర్హులకు మాత్రమే అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు కింద పంట పెట్టుబడి సహాయం కింద ఎకరాకు 5 వేల చొప్పున ఆర్థిక సహాయంను రైతు ఖాతాలో జమ చేశామన్నారు. యాసంగీ పంటను మొత్తం ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందన్నారు. పల్లెలను స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ‌ట్రాలీ, ట్యాంక్‌, ‌సెగ్రీ గేషన్‌, ‌డంప్‌ ‌యార్డు, వైకుంఠధామం, ప్రకృతి వనంను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టామన్నారు. పల్లెల స్వచ్ఛత అంశంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply