- మీ అవసరాలకు కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తా
- పోలీసు నియామక శిక్షణా తరగతులకు ప్రతీరోజూ హాజరు కావాలి
- పోలీసు నియామక ఉచిత శిక్షణ శిబిరానికి హాజరైన మంత్రి హరీష్‌రావు
నేను పోలీస్ అని చెప్పుకునేందుకు కొందరు యువతీ, యువకులు కలలుగంటారు. ఆ యువత తమ కలను నిజం చేసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తన వంతు తోడ్పాటు అందిస్తుందనీ, ఆ లక్ష్యాన్ని చేరాలన్న తపనకు తోడ్పాటు తోడైతే..వారు గెలుపు తీరాలకు చేరడం మరింత సులువు అవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు తరపున తొలిసారి పోలీసు నియామక ఉచిత శిక్షణ శిబిరానికి హాజరై నిరుద్యోగ ఉద్యోగార్థులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పున 33 పోలీసు నియామక ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసిందని, అందులో భాగంగానే సిద్ధిపేట జిల్లాలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ప్రతీరోజూ హాజరు కావాలని, నిరంతర ప్రయత్నంతోనే అనుకున్న లక్ష్యాలను చేరవొచ్చుననీ, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని, ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదని చెప్పారు. పరుగు, షాట్‌ఫుట్, లాంగ్ జంప్.. ఇలా వివిధ అంశాల్లో చక్కగా శిక్షణ పొందుతూ.. రాటుదేలేందుకు దోహద పడుతుందని, ప్రతిరోజూ మార్నింగ్ ఆల్ఫాహారం- టిఫిన్ ఏర్పాటు, 80 శాతం హాజరు ఉన్న వారికి తన సొంత డబ్బులతో స్టడీ మెటీరియల్, 95 శాతం హాజరు ఉన్న వారికి యూనిఫామ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ ఫుట్ ఇసుకను తదితర అవసరమైన స్పోర్టస్ మెటీరియల్స్ అందజేస్తానని ఉద్యోగార్థులకు భరోసా ఇచ్చారు.