Take a fresh look at your lifestyle.

రైతుల కోపాగ్నికి కమలం మాడి మసైతది

  • తెలంగాణది భయపెడితే భయపడే జాతి కాదు
  • వ్యాపారులకు రూ.లక్షల కోట్లు మాఫీ చేసినప్పుడు రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయరు?
  • పార్లమెంటులో టిఆర్‌ఎస్‌ ఎం‌పిలు కేంద్రాన్ని నిలదీస్తారు
  • ధరలు తగ్గించమంటే కేసులు పెడతారా?
  • పోరాటలు మాకు కొత్తేమీ కాదూ…వడ్లు కొంటామని చెప్పే వరకు చేస్తాం
  • రైతుల దు:ఖాన్ని తీర్చేందుకే ధర్నాలు
  • సిద్ధిపేట మహా ధర్నాలో మంత్రి హరీష్‌రావు

రైతుల కోపాగ్నికి కమలం మాడి మసైపోవడం ఖాయమనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలనీ డిమాండు చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నిర్వహించిన మహా ధర్నాలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ….దొంగే దొంగ…దొంగ అన్నట్లుగా రైతును మోసగిస్తున్న కేంద్రంలోని బిజెపి పార్టీ మంత్రులు, రాష్ట్రంలోని బిజెపి నేతలు తలా ఒకతీరుగా మాట్లాడుతున్నారన్నారు. గతంలో స్వరాష్ట్రం కోసం ధర్నాలు చేస్తే నేడు దుక్కి దున్నే రైతుల దు:ఖాన్ని తీర్చేందుకు ధర్నా చేయాల్సి వొస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతుల కోసం పని చేస్తున్నారనీ, రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ‌పని చేస్తుంటే…కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులకు శాపంగా మారిందన్నారు. సిఎం కేసీఆర్‌ ‌వ్యవసాయన్ని వృత్తిగా చేసుకున్నాడనీ, స్వయాన సిఎం కేసీఆర్‌ ‌రైతు కావడంతో రైతుల కష్టాలు తెలిసి రైతులు బాగుండాలనీ రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచితంగా 24గంటల పాటు నాణ్యమైన కరంటును సరఫరా చేస్తుంటే…కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం మాత్రం నల్ల చట్టాలను తీసుకురావడమే కాకుండా, వ్యవసాయ పొలాల వద్ద బోర్లకు మీటర్లు పెడుతుందనీ, వడ్లను కొనుగోలు చేయనంటుందనీ, ధరలు తగ్గించాలన్నందుకు రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారనీ, కార్లతో తొక్కించి చంపుతున్నారనీ అన్నారు. రైతులకు జరుగుతున్న నష్టాలపై సిఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించినందుకు కేసులు పెడతామనీ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. బెదిరింపులకు, భయపెడితే భయపడే జాతి తెలంగాణ కాదన్నారు. రైతులను కాపాడుకోవడానికి సిఎం కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారనీ, కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడే వరకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో రైతు సమస్యలపై టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు పార్లమెంటును స్తంభింపజేస్తారన్నారు. పెద్ద పెద్ద వ్యాపారులకు లక్షల కోట్ల రూపాయలు పూర్తిగా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయదని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే సిఎం కేసీఆర్‌ ‌దేశ ద్రోహిగా కనిపిస్తాడా? అన్నారు. రైతులను కొట్టే బిజెపి పార్టీకి వోట్లు ఎందుకు వేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నాడనీ, పెంచిన గ్యాస్‌, ‌డీజిల్‌, ‌పెట్రోలు ధరలు తగ్గించాలనీ, వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని అడిగితే దేశ ద్రోహం అవుతుందా? అని మంత్రి హరీష్‌రావు కేంద్రాన్ని, రాష్ట్ర బిజెపి నేతలను నిలదీశారు.

వడ్లను కొనుగోలు చేసే బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేననీ అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా వడ్లను కొనుగోలు చేసే బాధ్యత ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్తగా కేంద్రం వడ్లను కొనం అని అనడం ఏంటని ప్రశ్నించారు. ఆహార బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉటుందన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ మంత్రులు, రాష్ట్రంలోని నేతలు యాసంగిలో వడ్లు కొనం, దొడ్డు వడ్లు కొనం అంటూ చాలా తెలివిగా మాట్లాడుతున్నారన్నారు. పంజాబ్‌లో చలికాలంలో ఎక్కువగా ఉండటం వల్ల వరి పంట పండదన్నారు. వరికి బదులుగా ఒకసారి గోధుమను పండిస్తారన్నారు. బిజెపి సోషల్‌ ‌మీడియా తెలంగాణ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుందనీ, గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే హేళన చేశారనీ, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో కూడా ఇస్తుందన్నారు.

Prajatantra News, Telugu Kavithalu, Telangana updates

రైతుల కోసం ప్రతిఏటా తెలంగాణ ప్రభుత్వం 30వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందన్నారు. గతంలో నీళ్లకు, కరంటుకు ఇబ్బందులుండేవనీ, కానీ తెలంగాణ వొచ్చిన గడిచిన ఏడేండ్లలోనే 24 గంటల నాణ్యమైన కరంటును సరఫరా చేస్తున్నామనీ, పొలాలకు కూడా స్వచ్చమైన గోదావరి జలాలను ఇస్తున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానాలు, నల్ల చట్టాల వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పంట పొలాల వద్ద విద్యుత్‌ ‌మీటర్లను పెట్టం అని సిఎం కేసీఆర్‌ ‌కరాఖండిగా చెప్పారన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ బిజెపి పార్టీ ప్రభుత్వం నియమించిన మేఘాలయ గవర్నర్‌ ‌సత్యపాల్‌ ‌మాలిక్‌ ‌చెబుతున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకపుడు జై కిసాన్‌ అనే నినాదం ఉండేది, కానీ బిజెపి పాలనలో నై కిసాన్‌ అనే నినాదంతో పాలిస్తుందన్నారు.

70 సంవత్సరాల నుండి ఉన్న దొడ్డు వడ్ల కొనుగోలును కొనసాగించండని అడుగుతున్నామనీ, ఇదేమీ కొత్త కోరిక కూడా కాదన్నారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధానమంత్రికి రైతులందరూ మెస్సేజ్‌ ‌పెట్టాలన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలను చేసిన చరిత్ర టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఉందనీ, తెలంగాణలో పండించే ఈ దొడ్డు వడ్లను కేంద్రం కొంటామనీ చెప్పేదాకా పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. పంజాబ్‌ ‌రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ..తెలంగాణ రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనరు..కేంద్ర ప్రభుత్వమా ఇదెక్కడి న్యాయం అని కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణ రైతులను దగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడుదామనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొంటామనీ చెప్పడంతో పాటు రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసే వరకు బిజెపి పార్టీ మంత్రులు, నేతలను ఎక్కడికక్కడ ఎండగట్టడంతో పాటు ప్రతి గడపకూ బిజెపి విధానాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రతి గులాబీకి ఉందనీ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నాలో పెద్దయెత్తున రైతులు, టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు పాల్గొన్నాయి. వడ్లు కొనాలి అంటూ..యాసంగి వడ్లను కొంటారా..కొనరా..అంటూ ధర్నాలో నినాదాలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డస్ ‌ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం, మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మంజుల రాజనర్సు, ఏఎంసి ఛైర్మన్లు పాల సాయిరాం, కాముని శ్రీనివాస్‌, ‌రాగుల సారయ్య, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌నేతలు వేలేటి రాధాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, శ్రీహరిగౌడ్‌, ‌కోమాండ్ల రామచంద్రారెడ్డి, తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, గుండు భూపేష్‌, ‌శివకుమార్‌, ‌ప్రభాకర్‌వర్మతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply