Take a fresh look at your lifestyle.

ఆయిల్‌ ‌పామ్‌తో రైతుకు భరోసా

  • సాగులో సిద్ధిపేట జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
  • ప్రభుత్వ రాయితీలతో సాగు సులభం
  • నర్మెట్టలో పామాయిల్‌ ‌ఫ్యాక్టరీ నిర్మాణం
  • రైతులకు అవగాహన సదస్సులో మంత్రి హరీష్‌రావు
  • పామ్‌ ఆయిల్‌ ‌రైతు పాలిట కల్పవృక్షం : మంత్రి  సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి

ఆయిల్‌ ‌పామ్‌  ‌సాగుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌పంట సాగులో సిద్దిపేట జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలపాలని సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఉద్యానవన, ఆయిల్‌ ‌ఫెడ్‌ ‌సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అధ్యక్షతన బైరీ అంజయ్య గార్డెన్‌లో ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఎంపిక చేసిన రైతులతో పాటు ఔత్సాహిక రైతులు హాజరయ్యారు.

 

ఉమ్మడి ఖమ్మంకు చెందిన ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్న ఆదర్శ రైతులు ఆళ్లపాటి ప్రసాద్‌, ‌మంగిరెడ్డి పూర్ణ చందర్‌రెడ్డి, పూర్ణ చందర్‌రావు  సాగు అనుభవాలు, మార్కెటింగ్‌, ‌లాభాలు మొదలైన అంశాలను జిల్లా రైతులకు కూలంకషంగా వివరించారు. ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆయిల్‌ ‌పామ్‌ ‌పంట సాగు అన్ని విధాలుగా రైతులకు ప్రయోజనకరమన్నారు. తక్కువ నీరు, ఎక్కువ దిగుబడి, విస్తృత మార్కెటింగ్‌ అవకాశాలు, గిట్టుబాటు ధర, అంతర పంటల సాగుకు అవకాశం, పురుగు మందుల అవసరం లేక పోవడం, అడవి పందులు, పశువులు, కోతుల బెడద ఉండదన్నారు. పంట వేసిన 4 సంవత్సరాల నుండి 25 – 30 ఎండ్ల వరకు పంట క్రమం తప్పకుండా వొస్తుందన్నారు. అవగాహన సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పామ్‌ ఆయిల్‌ ‌పంట సాగుకు ముందుకు వొచ్చిన ఔత్సాహిక రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ…ప్రస్తుతం తెలంగాణలో ఆయిల్‌పామ్‌ ‌సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉందన్నారు. పామాయిల్‌ ‌సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు.

 

మొక్కలు, ఎరువులు, డ్రిప్‌లపైన రాయితీలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఆయిల్‌ ‌పామ్‌ ‌విస్తరణలో భాగంగా ఐదు కొత్త జిల్లాలను టిఎస్‌ ఆయిల్‌ ‌ఫెడ్‌కు కేటాయించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తెలిపారు. గద్వాల్‌, ‌నారాయణపేట, మహబూబాబాద్‌తో పాటు సిద్దిపేట జిల్లాను కూడా టిఎస్‌ ఆయిల్‌ ‌ఫెడ్‌కు కేటాయించిందన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 50 వేల 585 ఎకరాలలో ఆయిల్‌ ‌పామ్‌ ‌పంట సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. భదాద్రి- కొత్తగూడెం జిల్లాలోని రైతులు సుమారు 50 వేల ఎకరాలలో పామ్‌ ఆయిల్‌ ‌పంట సాగు చేస్తూ స్థిర ఆర్థిక రాబడులు సాధిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ, సహకారంతో అశ్వారావుపేట, దమ్మపేటలో మాదిరి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో పామాయిల్‌ ‌ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని తెలిపారు.


పామ్‌ ఆయిల్‌ ‌రైతు పాలిట కల్పవృక్షం : మంత్రి  సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి
అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంట సాగు అవసరం కాగా, రెండోది రైతులకు అత్యంత ప్రయోజనకరంగా ఆయిల్‌ ‌పామ్‌  ‌సాగు ఉందన్నారు. భదాద్రి-కొత్తగూడెం జిల్లాలో 50 వేల ఎకరాలలో ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగవుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎనిమిది లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగువుతుందన్నారు. దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాకు 21 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల నూనె అవసరముండగా దేశీయంగా 8 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. ఇంకా 13 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల నూనె లోటును 90 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అందువల్ల రైతులు నిస్సందేహంగా పామాయిల్‌ ‌తోటలు వేసుకొని లాభాలను ఆర్జించవొచ్చునన్నారు.

Leave a Reply