Take a fresh look at your lifestyle.

గత ప్రభుత్వాలు రైతులపై పన్నులు వేస్తే…

  • రైతులకే పన్నులు కడుతున్న ఘనత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిది
  • బీజేపీకి దమ్ముంటే దేశమంతా రైతు బంధు అమలు చేయాలి
  • పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెంచి వ్యవసాయాన్ని బీజేపీ భారం చేసింది
  • రైతు బంధు వారోత్సవాలలో మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి: గత ప్రభుత్వాలు రైతులపై పన్నులు వేస్తే రైతుకే రైతు బంధు పేరుతో పన్ను కట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు.కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలోని రైతులకు రూ.50 వేల కోట్లు బ్యాంకులలో వేసి నిజమైన రైతు బంధుగా మారారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీయార్‌ ‌స్టేడియంలో రైతు బంధు వారోత్సవాలలో మంత్రి హరీష్‌ ‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు గతంలో అప్పు పుట్టేది కాదనీ, పెట్టుబడి కోసం వ్యాపారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్‌ ‌వ్యవసాయ ఖర్చుల కోసం రైతు బంధు పేరుతో నగదు జమ చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌చార్జిలను పెంచి వ్యవసాయాన్ని భారంగా మార్చిందనీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులకు ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆ బారాన్ని తగ్గించిందని చెప్పారు. రైతులు ఆదుకోమని వస్తే పిట్టల్లా కాల్చి చంపించిన మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌, ‌రైతు బీమా, రైతు బంధు లేని మధ్యప్రదేశ్‌ ‌సీఎం చౌహాన్‌కు కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై గత ఏడేళ్లలో రూ.2.50 లక్షల కోట్లను టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వ్యయం చేసిందనీ, దేశంలోనే వ్యవసాయ రంగంపై అత్యధిక పెట్టుబడి పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటను కొనమంటే చేతులు ఎత్తేసిన దద్దమ్మ ప్రభుత్వం బీజేపీదనీ, అన్యాయంగా 7 మండలాలను లాక్కోవడంతో పాటు గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేంద్రంలో 15 లక్షల 69 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనీ, వాటిని నిపండం లేదనీ, దమ్ముంటే బీజేపీ ముఖ్యమంత్రులు అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడాలని సవాల్‌ ‌విసిరారు. రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్‌లో 2 లక్షలు ఉద్యోగ ఖాళీలు ఉన్నా వాటిని బర్తీ చేయకుండా తెలంగాణకు వచ్చి అబద్దాలతో విమర్శలు చేయడం బీజేపీ నేతలకే చెల్లిందన్నారు.

317 జీఓను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని భర్తీ చేయలని సీఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తుంటే బీజేపీ నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జీఓ 317ను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే అమలు చేస్తున్నామనీ, దీనిపై కూడా బీజేపీ విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. కొరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దనీ, ఏ బీజేపీ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు ఈ స్థాయిలో వేతనాలు పెంచలేదన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామనీ, అంతే కాకుండా బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన విధంగా 30 శాతం పీఆర్సీని దేశమంతా అమలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారు.

Leave a Reply