అమ్మకానికి కేరాఫ్ బిజెపి..! మాది నమ్మకానికి కేరాఫ్: మంత్రి హరీష్ రావు
- బిజెపితో అచ్చేదిన్ కాదు..సచ్చే దిన్ వచ్చాయి
- గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం
- ఈటల రాజేందర్ అసహనంతో మాట్లాడుతున్నారు
- ఆయన బాధ ప్రపంచ బాధగా వివరిస్తున్నారు
- వీణవంక టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు
కరీంనగర్, ఆగస్టు 26: బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారితే.. టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపంగా నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. వీణవంక మండలం దేశాయిపల్లి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, సమన్వయ సమితి కమిటీ, బూత్ కమిటీ ఇంఛార్జిల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజలందరి సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసహనంతో ఈటల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈటెల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడు అని పేర్కొన్నారు. హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ, పాడి కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావు సమక్షంలో వైస్ ఎంపీపీ లత సహా పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజల కష్టం తన కష్టంగా భావించే గొప్ప నేత సీఎం కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోంది. ఈటలకు రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగిలో ఎన్ని వడ్లు పండినా కొంటామని ఒప్పించాలి అని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నాడు ప్రజల కోసం కేసీఆర్ రాజీనామా చేశాడు.. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలి? ప్రజలు బాగుపడలా.. ఈటల బాగుపడలా ఆలోచించండి అని సూచించారు.
ఏడేళ్లు మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి.. ఈటల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి చేస్తాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదు. పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్య జరుతోంది.. ఎవరు గెలిస్తే లాభం జరుగుతుందో ఆలోచించాలి అని సూచించారు. రాబోయే ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కకుండా చేయాలన్నారు. హుజూరాబాద్‌కు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. వీణవంక మండలంలోని ఏ గ్రామానికి కూడా బండి సంజయ్ రూ. 10 లక్షలు ఖర్చు చేయలేదు. దత్తత తీసుకున్న రామకృష్ణాపూర్‌కు బండి రూపాయి పని కూడా చేయలేదు అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.