Take a fresh look at your lifestyle.

ప్రాణమున్నంత వరకు కేసీఆర్‌ ‌కరెంటు మీటర్లు పెట్టరు

  • దేశమే చూసి నేర్చుకునే విధంగా రాష్ట్ర అభివృద్ధి చేసిన ఘనత
  • బిజెపి ఫేక్‌ ‌సోషల్‌ ‌మీడియాను ఎండగట్టాలి, తిప్పికొట్టాలి
  • ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరించే బాధ్యత మీదే
  • నంగునూరు మండల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతల సమావేశంలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో,ఫిబ్రవరి 22 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గొంతుల ప్రాణం ఉన్నంత వరకు బాయిలకాడ కరెంటు మీటర్లు పెట్టనని తేల్చి చెప్పారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన నంగునూరు మండల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీపై కోత విధించిందనీ, సబ్సిడీ తగ్గడంతో రైతులకు ఎరువులు, యూరియా, డిఏపి ధరలు పెరుగుతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం వేస్తూ.,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ యేటా జిఎస్‌డిపిలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదన్నారు. కానీ, ఈ సారి 3.5 శాతం ఎప్పటిలాగే తీసుకోవచ్చునని, ఒక అర శాతానికి మెలిక పెట్టిందని విద్యుత్తు చట్టంలో సవరణలు చేయాలని.. బాయిలకాడ విద్యుత్‌ ‌మీటర్లు పెట్టాలని, బాయిలకాడ మీటర్లు పెడితే అర శాతం మీ రాష్ట్రానికి అప్పు తీసుకునేందుకు అనుమతి ఇస్తామనీ కేంద్రం మెలిక పెట్టిందని దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు సంక్షేమమే ధ్యేయంగా తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ మీటర్లు పెట్టనని తేల్చి చెప్పారని, ఈ విషయాన్ని ప్రజా క్షేత్రంలో ప్రజలకు అర్థమేయ్యేలా సవివరంగా చెప్పాలని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులను మంత్రి కోరారు.

మీటర్లు వద్దు..బిజెపి వద్దు..మన కేసీఆరే మనకు ముద్దు అంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా పార్టీ శ్రేణులు వినిపించాలని కోరారు. బిజెపి రైతులపై భారం వేస్తుందని, డీజీల్‌, ‌పెట్రోల్‌ ‌ధర పెంపు చేస్తుందని, ఎరువుల ధరలు పెరిగి, బాయి కాడ మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూళ్లు చేసే పనిలో పడిందని, స్వాతంత్య్రం వొచ్చినప్పటి నుంచి వడ్లు కొనేది కేంద్రమే..ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారాయన్నారు. కానీ, ఈ యాసంగిలో వడ్లు కొనమని చెప్పడం బిజెపి పార్టీ కేంద్రం తీరును అర్థమయ్యేలా వివరించాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌, ‌డీజీల్‌ ‌ధర మరో పది రూపాయలు పెంచుతారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శిస్తూ..ఈ విషయంపై గ్రామ, వార్డు, మండల స్థాయిలో చర్చలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే., బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. బట్టేబాజ్‌, ‌జూటే బాజ్‌ ‌పార్టీ బీజేపీ అని, గ్రామ క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, ఆ పథకాలను ఇప్పటికే కాపీ కొడుతున్నదనే విషయాన్ని ప్రజా క్షేత్రంలో సమగ్రంగా అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి బీజేపీ చేసే గోబెల్స్ ‌ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

నంగునూర్‌ ‌మండలంలోని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కలిసి కట్టుగా టీమ్‌ ‌వర్క్‌గా పని చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికై క్రియాశీలకంగా యాక్టివ్‌గా ఉండాలని, టిఆర్‌ఎస్‌ ‌పార్టీని ఇంకా అన్నీ విభగాలను సమన్వయం చేసుకుంటూ కలిసి పార్టీ బలోపేతంకై కృషి చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పేదల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఏమీ చేయకుండానే బీజేపీ సోషల్‌ ‌మీడియా ఫేక్‌ ‌ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కోరారు. రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని కేంద్ర బీజేపీ తీరుపై మండిపడుతూ..కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచినట్లు వాపోయారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, ‌ప్రతీ యేటా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, అలాగే రైతుభీమా..ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఇతర ఏ రాష్ట్రాలలో అయినా ఇస్తున్నారా..ప్రజలకు వివరించాలని సూచించారు.

సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో చాలా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కాళేశ్వరం నీళ్లు రావడంతో రైతులకు ఎన్నో కష్టాలు తప్పాయన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు ప్రాంతంలో నేషనల్‌ ‌హైవే నిర్మాణం కాబోతున్నదని, రైల్వే, ఆయిల్‌ ‌ఫామ్‌ ‌ఫ్యాక్టరీ, రోడ్లు, నీళ్లు, సబ్‌ ‌స్టేషన్లు, విద్య, వైద్య, ఇతరత్రా రంగాల్లో ముందుకు సాగుతున్నట్లు ప్రజలకు తెలిపే బాధ్యత పార్టీకి చెందిన ప్రతి ఒక్కరిపైనా ఉందనీ పార్టీ శ్రేణులను మంత్రి కోరారు.- 70ఏండ్లలో కాని పనిని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలో అభివృద్ధి చెంది సీన్‌ ‌రివర్స్‌గా మారిందని, కరెంటు, నీళ్లు, రైతు శ్రేయస్సుకై ప్రభుత్వం పాటు పడిందని వివరించాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్లు వేముల వెంకట్‌రెడ్డి, దువ్వల మల్లయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, రాగుల సారయ్య, కోమాండ్ల రామచంద్రారెడ్డి, బెదురు తిరుపతి, ఆకుబత్తిని రాము, లింగంగౌడ్‌తో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply