Take a fresh look at your lifestyle.

ఇవ్వడానికి సిగరెట్టా.. బీడీయా అంటూ అవహేళన

  • తెలంగాణ ఇవ్వడానికి వందకోట్ల మంది ఆమోదం కావాలన్న వైఎస్‌
  • ‌రాష్ట్ర ప్రజల్లో వైఎస్‌కు ఎప్పుడూ స్థానం లేదు
  • రాష్ట్ర వ్యతిరేకులకు ఈ గడ్డపై స్థానం లేదు
  • నీళ్లు, నిధులు దోచుకున్నందుకు షర్మిలకు మద్దతు ఇవ్వాలా మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించి..వందకోట్ల మంది ఆమోదం పొందాలని అవహేళన చేసిన వైఎస్‌ ‌తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉండరని ఆర్థికమంత్రి హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులకు ఈ గడ్డమిద స్థానం లేదని అన్నారు. వైఎస్‌ ‌షర్మిల పార్టీ ప్రకటనపై హరీష్‌ ‌రావు విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణను ఉద్దేశించి వైఎస్‌ ‌వ్యంగ్యంగా మాట్లాడారని…రాష్ట్రంలో కొత్త కొత్త పార్టీలు వొస్తున్నాయంటూ కామెంట్‌ ‌చేశారు. తెలంగాణ గురించి అడిగితే…ఇవ్వడానికి సిగరెట్టా, బీడీనా అని అసెంబ్లీలో రాజశేఖర్‌ ‌రెడ్డి అవహేళన చేశారని వ్యాఖ్యానించారు. నీళ్లు,నిధులు దోచుకున్నందుకు షర్మిల పార్టీకి మద్దతు ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల హృదయాలలో వైఎస్‌ ‌వారసులకి స్థానం లేదు. తాను బతికి ఉండగా తెలంగాణ రాదని రాజశేఖర్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించి, అవహేళన చేసింది రాజశేఖర్‌ ‌రెడ్డి. రాయల తెలంగాణ కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సదాశివపేటలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి భారీగా కాంగ్రెస్‌ ‌నేతలు చేరారు. సదాశివపేట ఎంపీపీ సహా ఆరుగురు సర్పంచ్‌లు, పలువురు నాయకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైకమాండ్‌ ‌మెప్పు కోసం, కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మెప్పు కోసం ఇక్కడ కాంగ్రెస్‌ ‌నాయకులు పని చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌నాయకులు గాంధీ భవన్‌లో ఎక్కువ, ప్రజలలో తక్కువ అని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే ఫోన్‌ ఎత్తడు, అవసరం అయితే కనీసం స్పందించడని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ‌నాయకులు అధికారంలోకి వొస్తామని పగటి కలలు కంటున్నారని, వారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. ఇక ఆంధ్రా తొత్తులకు, అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ గురించి మాట్లాడితే రాజశేఖర్‌ ‌రెడ్డి గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి పంపించాడు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణను అవమానించిన నాయకుడు వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి.. ఆయన వారసులమని కొందరు వొస్తున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మిద విశ్వాసంతోనే ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ 70 ఏండ్లలో చేయలేని పనులను టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏడేండ్లలో చేసి చూపించిందన్నారు. దేశంలో ప్రతి గ్రామంలో ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు సంగారెడ్డికి మెడికల్‌ ‌కాలేజీ మంజూరు చేశారు. గత పాలకులు సంగారెడ్డికి చేసిందేమి లేదన్నారు. సదాశివపేటకు కూడా త్వరలోనే గోదావరి నీళ్లు తీసుకోస్తామని మంత్రి హామి ఇచ్చారు. నిమ్జ్ ‌ప్రారంభమైతే ఈ ప్రాంత యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగాలు వొస్తాయని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు.

Leave a Reply