Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్‌రావు ఆలోచనతో… గొర్రెలకు ఉన్నాయి..హాస్టల్స్…

విద్యార్థులకు, ఉద్యోగులకు హాస్టల్స్ ఉం‌డటం సహజం. కానీ, గొర్రెలకు, గేదెలకు హాస్టల్స్ ఉం‌డటం  మీరు ఎక్కడైనా చూశారా? అయితే, విద్యార్థులు, ఉద్యోగార్థులకు హాస్టల్స్ ఉన్నట్లుగానే గొర్రెలకు, గేదెలకు కూడా సిద్ధిపేట జిల్లాలో హాస్టల్స్ ఉం‌టాయి. ఇది వినడానికి కష్టంగా ఉన్నా…ఇది నూటికి నూరు శాతం నిజం. ఔనూ…సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గొర్రెలకు, బర్రెలకు సైతం హాస్టల్స్ ఉన్నాయి. గొర్రెల కాపరులకు ఆర్థికాభివృద్ధి, గ్రామాలలో పారిశుద్ధ్యం పెంపొందించలన్నా ఉద్దేశ్యంతో…స్ధానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు వచ్చిన ఆలోచనతో గొర్రెల హాస్టల్‌కు జిల్లాలో అంకురార్పణ చేశారు.  హరీష్‌రావు మార్గదర్శనం మేరకు జిల్లా కలెక్టర్‌, ‌జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ అధికారులు గొర్రెల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలాలు, గొర్రె కాపరుల సొసైటీ స్థలాలలో    హాస్టల్స్‌ను ఏర్పాటు చేశారు. నంగునూరు మండలం నర్మెట్ట , సిద్ధిపేట గ్రామీణ మండలం ఇర్కోడ్‌, ‌నారాయణ రావుపేట మండలం ఇబ్రహీంపూర్‌, ‌జక్కాపూర్‌, ‌చిన్నకోడూరు మండలం గంగాపూర్‌, ‌సిద్ధిపేట పట్టణ మండలం మిట్టపల్లి గ్రామాలలో గొర్రెల హాస్టల్స్ ‌వినియోగంలో ఉన్నాయి. అలాగే, నంగునూరు మండలం అక్కనపల్లి ,గట్ల మల్యాల,సిద్ధిపేటగ్రామీణమండలం పుల్లూరు,బుస్సాపూర్‌, ‌నారాయణరావుపేట మండలంలక్ష్మీదేవిపల్లి గ్రామాలలో గొర్రెల హాస్టల్స్ ‌ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

ఒక్కో హాస్టల్‌లో 8 నుంచి 45 వరకు గొర్రెల షెడ్లు ఉన్నాయి. ఒక్కో షెడ్‌లో గరిష్టంగా వంద గొర్రెలు ఉండేలా అధికారులు వసతులు ఏర్పాటు చేశారు. గొర్రెల షెడ్‌ల చుట్టూ గొర్రెలు బయటకి పోకుండా బయట ఉండే కుక్కల, తోడేళ్ళు నుండి గొర్రెల రక్షణ నిమిత్తం ప్రవారీని అధికారులు నిర్మించారు. ప్రతి షెడ్‌కు నీటి సౌకర్యం ,విద్యుత్‌ ‌సౌకర్యం కల్పించారు. గొర్రెల హాస్టల్‌లో ఉండి గొర్రెలను రాత్రి వేళలో  పర్యవేక్షణ చేసేందుకు వీలుగా  ప్రత్యేక విశ్రాంతి గదిని నిర్మించారు. షెడ్‌ల నిర్మాణంకు ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చిస్తుండగా .. గేటు, చుట్టూ కాంపౌండ్‌కు ప్రత్యేక అభివృద్ధి నిధులు వెచ్చిస్తున్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధీ హామీ  పథకంను అనుసంధానం చేసుకుంటూ ప్రత్యేక అభివృద్ధి నిధులతో వీటిని అధికారులు నిర్మించారు. గొర్రెల హాస్టళ్ల  నిర్మాణం  వల్ల గొల్ల, కుర్మ కే కాక గ్రామానికీ, గ్రామ ప్రజలందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతుంది. గొర్రెల హాస్టల్‌ ‌నిర్మాణం వల్ల గ్రామంలో స్వచ్ఛత మెరుగవుతుంది. గ్రామం మధ్యలో గొర్ల మందను ఉంచడం వల్ల వాటి మల మూత్రాలకు దోమలు వృద్ధి చెందుతాయి. తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. రోడ్లపై గోర్లు మల మూత్రాలు పోయడం  వల్ల పారిశుద్ధ్యం సమస్యలు వస్తాయి. స్వచ్ఛ స్ఫూర్తి విఘాతం కలుగుతుంది. గొర్రెల హాస్టళ్ల నిర్మాణంతో పారిశుద్ధ్యం మెరుగవ్వడంతో పాటు స్వచ్ఛ పల్లెల స్ఫూర్తి పరిఢవిల్లుతుంది. అంతే కాకుండా,   గొర్ల కాపరులకు దొంగలు, తోడేళ్లు, కుక్కల బెడద తప్పుతుంది. వైద్య సేవలు వేగంగా అందుతాయి. విడతల వారీగా రాత్రి కాపు కాసే వీలు దొరుకుతుంది.గొర్రెల కాపరులు మధ్య ఐక్యత,స్నేహభావం  పెంపొందనుంది. వైద్య సేవలు వేగంగా అందుతాయన్నారు. గొర్రెల కాపరుల ఆర్థిక తోడ్పాటుతో హాస్టల్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గొర్రెల హాస్టల్‌లో సోలార్‌ ‌విద్యుత్‌, ‌గార్డెన్‌, ‌సీసీ కెమెరాలు, విశ్రాంతి గది, కమ్యూనిటీ సోక్‌ ‌పిట్‌లను సైతం నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గొర్రెల హాస్టల్‌లలో భాగస్వామ్యం అయ్యేందుకు మొదట గొర్రెల కాపరులు సంకోచించగా హాస్టల్‌ల నిర్మాణం పూర్తయిన తర్వాత హాస్టల్‌ ‌వల్ల కలిగే ప్రయోజనాలను స్వయంగా చూసిన గొల్ల,కుర్మలు గొర్రెల  హాస్టల్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, తెలంగాణలోనిఇతర జిల్లాల ప్రతినిధులు సిద్ధిపేట జిల్లాను సందర్శించి గొర్రెల హాస్టళ్ల నిర్మాణం,ప్రయోజనాలపై అధ్యయనం చేస్తున్నారు. తమ రాష్ట్రం, జిల్లాలో గొర్రెల హాస్టళ్ల నిర్మాణం చేపడతామన్నారు.  గొర్రెల హాస్టళ్లు సక్సెస్‌ ‌కావడంతో గేదెలకు సైతం ప్రత్యేకంగా  హాస్టళ్లను నిర్మిస్తున్నారు. గొర్రెల హాస్టల్‌ ‌లకంటే మెరుగైన సౌకర్యాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అధ్యయనం చేసేందుకు సిద్ధిపేటకు వస్తున్నారు: మంత్రి హరీష్‌రావు
దేశంలోనే తొలిసారిగా సిద్దిపేటలో నిర్మించిన సామూహిక గొర్రెల వసతి సముదాయం ( గొర్రెల హాస్టల్‌) ‌రాష్ట్ర , దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనీ,  గొర్రె కాపరులకు, గ్రామ ప్రజలకు ఇరువురికి  ప్రయోజనకారిగా ఉన్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఈ హాస్టళ్ల నిర్మాణాల వల్ల   గ్రామాలు పరిశుభ్రంగా ఉంటున్నాయనీ,  దేశంతో పాటు తెలంగాణ లోని జిల్లాలు గొర్రెల హాస్టళ్లు తమ రాష్ట్రాలు, జిల్లాలలో చేపట్టాలని భావించి గొర్రెల హాస్టల్స్‌ను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు సిద్ధిపేటకు వస్తున్నారనీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Leave a Reply