కొంటానన్న రా రాయిస్ కూడా తీసుకోలే….ఇచ్చే నిధులు ఇవ్వలే
పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు
బిజెపిపై మంత్రి హరీష్ రావు ఫైర్
గజ్వేల్ రైల్వే ర్యాక్ పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు
సీడ్ పాయింట్‌గా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్
గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
సిద్ధిపేట/గజ్వేల్, ప్రజాతంత్ర, జూన్ 27 : పక్క రాష్ట్రాల్లో బాయిలకాడ కరెంటు మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకుంటున్నారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. కేంద్రం కొంటాననీ చెప్పిన రా రాయిస్ కూడా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైతులకు అన్యాయం చేస్తుందనీ, తెలంగాణకు వొచ్చే ముందు బిజెపికి చెందిన పిఎం, కేంద్ర మంత్రులు, నేతలు వరి ధాన్యం ఎంత కొంటారో చెప్పి రావాలన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో హైదరాబాద్‌కు రానున్న కేంద్రంలోని బిజెపి నేతలు, మంత్రులు ఏం చెబుతారనీ ప్రశ్నించారు. సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ రైల్వే స్టేషన్లో రాష్ట్ర మంత్రులు తీన్నీరు హరీష్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్, ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడి, రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఎరువుల ర్యాక్ పాయింట్‌ను ప్రారంభించారు. తొలి విడతల ఏపిలోని కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ నుంచి 21 బోగీలతో 1300మెట్రిక్ టన్నులతో గజ్వేల్‌కు చేరుకున్న రైల్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… ర్యాక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాటం అని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్‌కు మోక్షం లభించిందనీ, రైల్వే లైన్ కేంద్రం బాధ్యత.. కానీ, నేడు గజ్వేల్‌కు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువ అని అన్నారు.
నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్‌రెడ్డి, రోశయ్య నిధులు ఇచ్చేవారు కాదనీ, రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు ఎప్పటికప్పుడు ఇచ్చామనీ, కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసిందనీ, ఈ లైన్ కోసం 2200 ఎకరాల భూ సేకరణ చేశామనీ, ఈ ర్యాక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరమన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామంటే, ఎక్కడి నుంచి ఇస్తావ్ అని నాటి కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నాడనీ గుర్తు చేస్తూ…అది ఈ రోజు తెలంగాణలో నిజమైందన్నారు. నీటి తీరువ రద్దు, పన్నులు రద్దు చేసిన ఘనత సిఎం కేసీఆర్‌దేననీ, రైతులకు నీళ్లు ఇచ్చినం, గౌడన్లు కట్టినం, చెరువులు బాగు చేసినం, ఎరువులు ఇస్తున్నామన్నారు. మంగళవారం నుంచి రైతులకు రైతుబంధు ద్వారా 7500 కోట్లు ఖాతాల్లో పడుతున్నాయనీ, పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారనీ, బాయిల కడా మీటర్లు పెట్టనందుకు రాష్ట్రానికి 25వేల కోట్లు రాకుండా పోయాయనీ, అయినా రైతుల క్షేమమే ముఖ్యమని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. మనం బాగవుతుంటే, అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నిధులు ఆపుతున్నారనీ ఆరోపించారు. గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా జై జవాన్, జై కిసాన్ అనే వారు.. నేడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నై జవాన్, నై కిసాన్ అంటుందన్నారు. మొన్న నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీస్తే, నేడు ఆర్మీలో కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చి యువకుల ఉసురు తీస్తున్నారన్నారు. తెలంగాణకు వొచ్చి బిజెపి నేతలు ఏం చెబుతారనీ నిలదీశారు. నీతి ఆయోగ్ 24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని చెప్పినా ఇవ్వలేదని చెబుతారా? వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకు పోయి తెలంగాణకు అన్యాయం చేశామని చెబుతారా? మా ఐటీఐఆర్ రద్దు చేశామని చెబుతారా? వరి కొనుమని అంటే నూకలు తినమని చెప్పి అవమాన పరిచిన ప్రభుత్వం బిజెపి అన్నారు.
బిజెపి నేతలు హైదరాబాద్‌కు వొచ్చేలోపు వరి ధాన్యం ఎంత కొంటావో చెప్పి రావాలని డిమాండు చేశారు. కేంద్రం కొంటానన్న రా రాయిస్ కూడా తీసుకోకుండా అన్యాయం చేస్తుందన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ…అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం ఈ ర్యాక్ పాయింట్ ద్వారా అందనుందనీ, ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఉహించని అభివృద్ధి టిఆర్ఎస్ హయాంలో జరుగుతుందన్నారు. రాబోయే వందల సంవత్సరాల వరకు ప్రజల అవసరాలు తీర్చే పనులు జరుగుతున్నాయనీ, సీడ్ పాయింట్‌గా గజ్వేలత్ అభివృద్ధి చెందుతుందనీ, రాష్ట్ర బాగుపై విపక్షాలకు ప్రేమ లేదన్నారు. దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఎన్ని ఏళ్ళు ఏలినా తెలంగాణకు ఒరిగిందేమి లేదనీ, ఈ రోజు కేంద్రాన్ని ఏలుతున్న పార్టీ వరి సాగులో, వడ్ల కొనుగోలులో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలనీ, రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించి రాజకీయ లబ్ది పొందాలని బిజెపి చూస్తుందనీ నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, గజ్వేల్ ఏఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గుండా రంగారెడ్డి, టిఆర్ఎస్ నేతలు జి.ఎలక్షన్‌రెడ్డి, వంటేరు సుధాకర్‌రెడ్డి, బాలేషంగౌడ్, మల్లేశం, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.