- రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు
- ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు
నిత్యావసరాలు, పెట్రో, వంట గ్యాస్ ధరలు భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీకి ఓటెందుకు వేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నల్గొండ – ఖమ్మం- వరంగల్ జిల్లా పట్టబధ్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదని యువతకు వీటిని వివరించి ఓటు అభ్యర్థించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని అన్నారు. ఇంటింటికీ తాగునీరు, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మిలాంటి పేదలకు ఉపయుక్తమైన పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయో ఆ పార్టీ నాయకులు చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. 14.2 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే నంబర్‌గా ఉంది. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం కూడా మనదే. మన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ప్రజాసమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభత్వం నుంచి 900 కోట్లు బీఆర్జీఎఫ్ నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ రావాలని, కానీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆయన విమర్శించారు. నారాయణ ఖేడ్ వద్ద కర్ణాటక రాష్ట్రంలోని మహిళలు నీళ్ల కోసం తండ్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రైతులు కరెంటు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అడబిడ్డలకు కల్యాణలక్ష్మీ రావడం లేదని ఆయన తెలిపారు.
ఇంటింటికి నల్లా ఇచ్చి భగీరథ నీటిని అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి వారిని ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్‌ది అని ఆయన తెలిపారు. దేశంలో 14.2? వృద్ధి రేటు ఎక్కువగా వున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లారాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించే గొంతుకనవుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1,35,000 ఉద్యోగుల నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతుందని పల్లా తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రానికి అధిక కంపెనీలు రావడానికి సీఎం కేసీఆర్ ప్రముఖ పాత్ర వహించారన్నారు. 43 లక్షల మందికి ఆసరా పథకం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. 60 లక్షల మందికి రైతు బంధు అందిస్తున్నామన్నారు. చెరువులు, కుంటలను కాళేశ్వరం నీళ్లతో నింపుకున్నామన్నారు.
కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థతి దెబ్బతిందన్నారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుందని పల్లా తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని ఉద్యోగల కల్పన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని ఆయన పేర్కొన్నారు.