తోగుట యవ గర్జనలో మంత్రి హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్, బిజెపి నాయకులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా తోగుటలో తెరాస యువ గర్జన, భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..డిసెంబర్ 9న ఆనాడు వొచ్చిన తెలంగాణ వెనక్కు పోతోందని అందరు రాజీనామాలు చేశారు, కానీ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని కిషన్ రెడ్డి ఇప్పుడు నేను తెలంగాణ అంటున్నారు. బీజేపీ అధికారంలోకి వొస్తే నల్లధనం తెచ్చి ప్రతీ ఒక్కరి అక్కౌంట్లో 15 లక్షలు వేస్తం అన్నారు. ఆరేళ్లయింది ఆ 15 లక్షలు వొచ్చాయా ? అని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వొస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలన్నారు. ఆరేళ్లలో ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి…ఇచ్చిండ్రా? అని అడిగారు. నిజామాబాద్లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే… పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. వొచ్చిందా పసుపు బోర్డు అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం మార్కెట్లను రద్దు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టిన పార్టీ అన్నారు. బాయిలకాడ మీటర్లు పెట్టే పార్టీ బీజేపీ అని విరుచుకుపడ్డారు. ముత్యం రెడ్డి మంచి నాయకుడని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. అదే నిజమయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. కాంగ్రెస్కు ఢిల్లీలో ఏం లేదు….గల్లీలో ఏం లేదన్నారు.