సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తప్ప..యువత కోసం చేసిందేమిలేదు
మంత్రి తన్నీరు హరీశ్‌రావు
బిజెపి పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తప్ప యువత కోసం చేసిందేమి లేదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. జీహెచ్ఎంసీ పఠాన్‌చెరు డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టుకుమార్, భారతీనగర్ డివిజన్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డికి మద్దతుగా మంత్రి హరీశ్‌రావు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒకవైపు చెబుతుంటే మరోవైపు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామంటూ అబద్ధాలతో ఊదర గొడుతున్నారన్నారు.
అబద్ధాలు చెబుతున్న బిజెపి నాయకులకు యువత బుద్ధి చెప్పాలన్నారు. వరదలు వస్తే బెంగుళూరుకు రూ. 600, గుజరాత్‌కు రూ. 500 కోట్లు ఇచ్చారని, అదే హైదరాబాద్‌కు వరదలు వస్తే కేంద్రం ఒక్క పైసా కుడా ఇవ్వలేదన్నారు. బిజెపి ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసి నగర యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారన్నారన్నారు. బిజెపి అధికారంలోకి వొచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఉద్యోగులను తీసేస్తున్నారన్నారు. నల్లధనం బిజెపి నాయకుల జేబుల్లోకి వెళ్లిందన్నారు.